Eluru Crime News: ఏలూరు పెదవేగి మండలం రాట్నాలకుంటలో గత నెల 25వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పక్కింటి వారేనని.. దొంగతనం చేయడానికి వచ్చావంటూ వాళ్లు కొట్టడంతోనే మనస్తాపానికి గురై తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. 


పక్కింటి వారు కొట్టడంతోనే ఆత్మహత్య!


ఏలూరు నగరానికి చెందిన 17 ఏళ్ల కర్ణాటి కోమలేశ్వరి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చుదువుతోంది. కోమలేశ్వరి తండ్రి గతంలోనే చనిపోయాడు.తల్లి పద్మావతే కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే గత నెల 25వ తేదీన కర్ణాటి కోమలేశ్వరి పక్కనే ఉన్న ఇంట్లోని కుక్క పిల్లలను చూసేందుకు వారి ఇంటికి వెళ్లింది. అయితే కోమలేశ్వరిని చూసిన ఆ ఇంటిలోని భార్య భర్తలు దొంగతనం చేసేందుకు వచ్చావా అంటూ కొట్టారని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అదే రోజు కోమలేశ్వరి.. పెదవేగి మండలం రాట్నాలకుంటలో ఉంటున్న నానమ్మ వెంకట రమణ ఇవద్దకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగింది. తర్వాత కోమలేశ్వరిని గమనించి హుటాహుటినా దగ్గరిలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కోమలేశ్వరి పరిస్థితిని గమనించి వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించగా.. కుటుంబ సభ్యులు కోమలేశ్వరిని విజయవాడకు తరలించారు. అప్పటి నుండి కోమలేశ్వరి అక్కడే చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో ఈ నెల 8 వ తేదీన రాత్రి కోమలేశ్వరి తుది శ్వాస విడిచింది. 


బిడ్డ ఆత్మహత్యపై తల్లి ఫిర్యాదు


బిడ్డ మరణంపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్క పిల్లలను చూసేందుకు వెళ్తే.. దొంగతనానికి వచ్చావని కొట్టారని, అందుకే తన బిడ్డ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొంది. తల్లి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశామని.. పూర్తి స్థాయిలో, అన్ని రకాల కోణాల్లో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు మూడో పట్టణ సీఐ వరప్రసాద రావు తెలిపారు.


కన్న బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్ని రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. అభం శుభం తెలియని తనను దొంగతనానికి వచ్చావని ఎలా కొట్టారంటూ ఆవేదన చెందారు. తన బిడ్డ దొంగతనం చేసే వ్యక్తి కాదని తల్లి పద్మావతి పేర్కొంది. రేపో మాపో పెళ్లి అయి అత్తారింటికి వెళ్లాల్సిన బిడ్డ ఇప్పుడు కాటికి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని బోరున విలపించింది. గతంలోనే భర్త చనిపోయాడని, ఇప్పుడు బిడ్డ కూడా తనను వదిలేసి వెళ్లిపోయందని, ఇప్పుడు తాను ఒంటరిని అయ్యానంటూ గుండెలవిసేలా రోదించింది. ఇప్పుడు తాను ఎవరి కోసం బతకాలని, ఎందుకోసం బతకాలని విలపించడంతో... బంధు మిత్రులు, చుట్టు పక్కల వారి కళ్లు చెమర్చాయి.