ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ప్రేమించి వివాహం చేసుకున్నారనే కారణంతో యువకుడిపై దాడి చేసి, స్తంభానికి కట్టేసి యువతిని ఆమె కుటుంబసభ్యులు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపై పట్టపగలు దాడి చేయడం, ఆపై స్తంభానికి కట్టేసి కట్టేయం.. యువతిని కిడ్నాప్ చేయడంతో ఏలూరు జిల్లా ఎస్పీ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముసునూరు పోలీసులు ఈ కేసును ఒక సవాలుగా తీసుకున్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేసి, కేవలం 18 గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌కు గురైన యువతిని సురక్షితంగా విడిపించారు. యువకుడిపై దాడి చేసి, యువతి కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
లవ్ మ్యారేజీ.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక జంటపై జరిగిన దాడి, యువతి కిడ్నాప్ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న మండవల్లి మండలానికి చెందిన సాయిచంద్, దుర్గా పెద్దలు తమ ప్రేమను నిరాకరించడంతో ఆలయంలో లవ్ మ్యారేజీ చేసుకున్నారు. దుర్గ ముసునూరు పోస్టల్ శాఖలో విధులు నిర్వహిస్తోంది. డిసెంబరు 23 ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట గత వారం పెళ్లి చేసుకుంది. పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దుర్గ విధులు నిర్వర్తిసోన్న రమణక్క పేటలో ఈ ప్రేమజంట కాపురం పెట్టింది. ఈ క్రమంలో తమ పెళ్లి ఫోటోలను యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అయితే, వీరి వివాహం గురించి తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు జనవరి 1న గురువారం నాడు రమణక్కపేట చేరుకుని కొత్త జంటపై దాడి చేశారు. యువకుడిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా, సాయిచంద్‌ను ఒక స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేశారు. స్థానికుల సహాయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సాయిచంద్ ఫిర్యాదు చేశాడు. తన భార్యను ఆమె కుటుంబసభ్యులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదు చేయగా.. దాడి, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 18 గంటల్లోనే ఆచూకీ గుర్తించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ అయిన యువతిని విడిపించారు.