Eluru News: అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. చేతిలో ఐదేళ్ల చంటిపాపతో ఉండగానే తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇన్నాళ్లుగా హాయిగానే సాగింది వీరి కాపురం. కానీ ఇటీవలే ప్రియుడు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. గతరాత్రి కూడా ఇలాగే గొడవ జరగగా.. తల్లీ కూతుళ్లిద్దరినీ ప్రియుడు గునపంతో కొట్టి చంపాడు. 


అసలేం జరిగిందంటే..?


ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామ పరిధి శ్రీరామ నగర్ లో శనివారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన దేవరపల్లి రవి పదేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చారు. శ్రీరామ్ నగర్ కు చెందిన 35 ఏళ్ల సొంగా యేసుమరియమ్మ పదేళ్లుగా భర్త నుంచి దూరంగా 15 ఏళ్ల కుమార్తె అఖిలతో కలిస ఉంటున్నారు. రవి లారీ డ్రైవర్ గా పని చేసేటప్పుడు యేసుమరియమ్మతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ రెండేళ్లు ఏలూరులో ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి శ్రీరామ్ నగర్ లో ఉంటున్నారు. అఖిల ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ప్రియుడు రవి ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. 


కరెంటు బిల్లు కట్టమంటే ఫుల్లుగా తాగి గొడవ చేశాడు..!


అయితే కరెంటు బిల్లు కట్టమని యేసుమరియమ్మ రవికి డబ్బులు ఇచ్చింది. అయితే ఆ డబ్బుతో రవి ఫుల్లుగా మద్యం తాగాడు. కరెంటు బిల్లు సకాలంలో చెల్లించనందుకు... జనవరి 30వ తేదీన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దీంతో వీరిద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఆరోజు ఇద్దరూ గొడవ విపరీతంగా గొడవ పెట్టుకోగా.. ఇక ఇతడితో ఉండి లాభం లేదనుకొని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యేసుమరియమ్మ కుటుంబ సభ్యులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం రవి వారి ఇంటికి వెళ్లాడు. బుద్ధిగా ఉంటాను ఇక నుంచి మరియమ్మతో పాటు అఖిలను ప్రాణంగా చూసుకొని సాకుతానని వారిని నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక మరియమ్మను గునపంతో కణితి మీద, అఖిలను తన వెనుక భాగంలో కొట్టి చంపాడు. వాళ్లు నొప్పితో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వరకూ అలాగే చూస్తుండిపోయాడు. 


ఎంతసేపు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో... వెలుగులోకొచ్చిన విషయం


శనివారం ఉదయం మరియమ్మ తమ్ముడు గురవయ్య ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా.. ఇద్దరి మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, రూరల్ సీఐ అంకబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.