Kumram Bhim Asifabad : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధారం సాయంత్రం ఒక రైతును తొక్కి చంపిన ఏనుగులు ఈ ఉదయం కూడా మరో రైతుపై దాడి చేశాయి. ఇద్దరు రైతులు స్పాట్‌లోనే మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.


ఇతర్రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బుధవారం ఒకర్ని , ఈ ఉదయం మరొకర్ని బలి తీసుకున్నాయి. బుధారం సాయంత్రం పొలానికి వెళ్లిన అల్లూరి శంకర్ అనే రైతులను ఏనుగులు తొక్కి చంపేశాయి. ఈ ఘటన మరువక ముందే మరో రైతు ప్రాణాలు తీశాయి గజరాజులు.   




కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి రైతు ఉదయాన్ని పొలానికి వెళ్లాడు. ఆయనపై దాడి చేసిన ఏనుగులు చంపేశాయి. పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు ఈ ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు మోటర్‌ వేస్తున్న క్రమంలో అతనిపై ఏనుగు దాడి చేశాయి. ఈ దాడిలో పోచయ్య స్పాట్‌లోనే ప్రాణాలు వదిలేశాడు. 




ఏనుగులు దాడి గుర్తించిన స్థానికులు హడావుడి చేసి వాటిని తరిమేశారు. వెళ్లి చూస్తే అప్పటికే పోచయ్య చనిపోయినట్టు గుర్తించారు. స్థానికులు కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలోకి ఏనుగు వెళ్లిపోయింది. పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పిన పోచయ్య చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


ఏనుగు దాడి సంగతిని స్థానికులు అటు పోలీసులకు, ఇటు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము చెప్పే వరకు ఎవరూ పొలాలకు తోటలకు వెళ్లొద్దని బయటకు రావద్దని సూచిస్తున్నారు.


సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణహిత నది దాటి వచ్చిన ఏనుగులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. ఇది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే ప్రజలు బయటకు రావద్దని ఏనుగు అటవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. 


సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లా: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గంలో ఏనుగుల సంచారం, ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు మాజీ ఎమ్మెల్యే కోనప్ప. అటవీశాఖ మంత్రి సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. మంత్రులు ఇద్దరూ స్పందించాలని అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. 


ఏనుగు దాడి బాధితులకు ఉద్యోగం ఇవ్వాలి: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
ఏనుగు దాడిలో మరణించిన బూరేపల్లివాసి శంకర్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌..."అటవీశాఖ అధికారుల సమన్వయలోపంతో ఏనుగులు సంచారం ఎక్కువైంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్‌లో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. మహారాష్ట్రలో ఇస్తున్నట్టు చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా అందివ్వాలి. ఏనుగును తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వాలి.