Electricity Department AE Murder Case | రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) లలిత కుమారి హత్య కేసును రాజాం టౌన్ పోలీసులు ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమె భర్త సీతారామరాజు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2003లో వివాహం జరిగిన తర్వాత భర్త ప్రోత్సాహంతోనే లలిత కుమారి బి.టెక్ పూర్తి చేసింది. మొదట జీఎంఆర్‌ఐటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేశారు. ఆ తర్వాత కష్టపడి చదివి 2017లో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌ (AE)గా ఉద్యోగం సాధించి, ఇటీవల చీపురుపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు.

Continues below advertisement

అనుమానంతో పక్కా ప్లాన్.. గొడ్డలితో ఘాతుకం

లలిత కుమారికి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయినప్పటి నుంచి ఆమెపై భర్త సీతారామరాజుకు అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని ప్లాన్ రచించి, ప్రత్యేకంగా ఒక గొడ్డలిని కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు. అక్టోబర్ 25న ఉదయం లలిత కుమారి రోజులాగే డ్యూటీకి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరగా, బస్టాప్ దగ్గర దింపుతానని నమ్మించిన భర్త కొండంపేట శ్మశాన వాటిక సమీపంలోకి రాగానే వాహనం ఆపాడు. ఆపై ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం భార్య మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.

Continues below advertisement

పోలీస్ డాగ్ స్క్వాడ్ గుర్తింపుతో నిందితుడి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్‌లోని నిఘా శునకం నేరుగా మృతదేహం వద్ద నుంచి వెళ్లి ఆమె భర్త సీతారామరాజు వద్ద ఆగడంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది. రాజును అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే స్వయంగా గొడ్డలితో నరికి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడు అయిన ఏఈ భర్త సీతారామరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.