Cyber Crime : అడిగిన వారికి లేదనుకుండా సాయం అందిస్తున్నారు సినీ నటుడు సోనూసూద్. తన ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో సోనూసూద్ ఫౌండేషన్ సేవలు అందిస్తుంది. సామాజిక మాధ్యమాలతో తనను ఎవరు సాయం కోరినా సోనూసూద్ వెంటనే స్పందిస్తారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు సోనూసూద్ పేరు వాడుకున్న ఓ కుటుంబాన్ని మోసం చేశారు.
కొడుకు చికిత్స కోసం
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన చిన్నారి వైద్యం కోసం ఓ తల్లి ఆన్లైన్ లో దాతల సాయం కోరింది. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్ చేశారు. సోనూసూద్ కార్యాలయం నుంచి ఫోను చేస్తున్నట్లు నమ్మించారు. సాయం చేస్తామని చెప్పి ఎనీ డెస్క్ యాప్ ద్వారా ఆమె బ్యాంకు వివరాలు సేకరించారు. తన కుమారుడి చికిత్స కోసం దాతలు వేసిన నగదును సైబర్ మోసగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా మాయం చేశారు. ఈ ఘటన రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళ పోలీసులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
సోనూసూద్ పేరుతో మోసం
సినీనటుడు సోనూసూద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేసి బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌లో చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్ లో నివాసం ఉంటున్న సత్యశ్రీ అనే మహిళకు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. అంత ఆర్థిక స్థోమత లేక మహిళ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్నేహితులు, బంధువులకు మెసేజ్ పెట్టింది.
ఎనీ డెస్క్ యాప్ తో దోచేశారు
సోషల్ మీడియా ఈ మెసేజ్ ఫార్వడ్ అవుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు జూన్ 27వ తేదీన సత్యశ్రీకి ఫోన్ చేశారు. సోనూసూద్ ఫౌండేషన్ నుంచి ఫోను చేస్తున్నట్లు చెప్పారు. చిన్నారి చికిత్సకు సాయం చేస్తామని మహిళను నమ్మించారు. దీంతో ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేసేందుకు ప్రయత్నించింది. అవి అవసరం లేదని, ఫోనులో ఎనీ డెస్క్ యాప్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేయాలని ఆమెకు సూచించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు ఆమె వివరాలు యాప్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెకు నగదు రాకపోగా విడతల వారీగా సత్యశ్రీ బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.