తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గంజాయి పట్టుబడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహన సీట్ లో అమర్చి గంజాయి రవాణా చేస్తున్నారు. గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి గంజాయి ముఠాలు. ద్విచక్ర వాహనం సీట్ లో అమర్చిన 34 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో భారీగా గంజాయి, మద్యం, నాటుసారా బెల్లపు ఊటలు పోలీసుల దాడుల్లో లభ్యమయ్యాయి. తూర్పుగోదావరి మన్యంలో భారీగా తెలంగాణ మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ నుంచి చింతూరు మండలానికి అక్రమ మద్యం తరలిస్తుండగా ఎటపాక పోలీసులు పట్టుకున్నారు. సుమారు 55 వేల 9 వందల రూపాయల విలువైన 260 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం రవాణా చేస్తున్న చింతూరు మండలం చిడుమూరు గ్రామానికి చెందిన మడకం రాజయ్య, గాదెల రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మద్యం బాటిళ్లతో పాటు టాటా మ్యాజిక్ వాహనాన్ని సీజ్ చేశారు. తాళ్ళరేవు మండలం కోరంగి మడ అడవుల్లో ఎక్సైజ్ అధికారిని భవాని కోరంగి పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో 22000 లీటర్ల బెల్లపు ఊట, 200 లీటర్ల నాటు సారా, బోటు సీజ్ చేశారు.
Also Read: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం
200 కేజీల గంజాయి దహనం
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో 2018 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నమోదైన ఎనిమిది కేసులలో సీజ్ చేసిన 200 కిలోల గంజాయి కాల్చివేశారు. కోర్టు పర్మిషన్ తో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో గంజాయిని ధ్వంసం చేశారు. డీసీపీ మాట్లాడుతూ గంజాయి రవాణా, సాగుకు, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై పీడీయాక్ట్ లను నమోదు చేస్తామని ప్రకటించారు. పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేస్తామని ప్రకటించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతపై దృష్టిసారించాలన్నారు. గంజాయి మత్తులో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారని, అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100కి గాని, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
Also Read: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్... 27న బంద్ కు పిలుపునిచ్చిన మావోలు...