Drug Bust at Hyderabad Resort | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ వచ్చిందంటే చాలు నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీల జోరు తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని గోల్కొండ సమీపంలో గల తారామతి బారాదరి రిసార్ట్‌లో ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో నిర్వహించిన ఒక భారీ డ్రగ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), గోల్కొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాలీవుడ్ నటుడు, భార్యాభర్తలకు డ్రగ్స్ పాజిటివ్రిసార్టులో జరిగిన పార్టీకి సుమారు 300 మంది వరకు హాజరయ్యారు. పక్కా సమాచారంతో తారామతి బారాదరి రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు ప్రాథమికంగా అనుమానం వచ్చిన 35 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వీరిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్‌తో పాటు అభినాశ్ ఫణి, యోగేశ్వర్, బ్రెట్ జాసన్‌లతో పాటు నిహార్- ఆషి అనే భార్యాభర్తలు సైతం గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు సేవించినట్లు నిర్ధారణ అయింది. మొత్తం ఆరుగురికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. డీజే జాసన్ సూచన మేరకు వీరంతా ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ పార్టీకి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి భారీ సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, ఐటీ ప్రొఫేషనల్స్ హాజరయ్యారు. అయితే పాల్గొన్న వారిలో స్థానికుల కంటే ఇతర నగరాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అయితే నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ పార్టీలు రెగ్యూలర్ గా జరుగుతున్నాయా అనే కోణంలో హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది.
