Doctor Wife Stabs Son Karnataka:   కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో  ఘోరం జరిగింది.   ఒకే ఇంట్లో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు శవమై తేలగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. మిగిలిన మూడో వ్యక్తే ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితురాలు. పవన్ హైస్కూల్ ఎదురుగా ఉన్న  రాంకా అపార్ట్‌మెంట్స్  6వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్న ప్రముఖ అనస్థీషియా నిపుణుడు డాక్టర్ కిరణ్ హొన్నావర్ తన బెడ్‌రూమ్‌లో దారుణ హత్యకు గురయ్యారు. అదే ఫ్లాట్‌లోని మరో గదిలో ఆయన 8 ఏళ్ల కుమారుడు ఒంటిపై నిండా కత్తిపోట్లతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు.

Continues below advertisement

బుధవారం రాత్రి ఈ దారుణ ఉదంతం వెలుగుచూసినప్పుడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ కనిపించింది. డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉంటే, ఆయన భార్య, వృత్తిరీత్యా ఆప్తాల్మాలజిస్ట్  అయిన డాక్టర్ ప్రియాంక కటనహళ్లి  ఏమాత్రం చలనం లేకుండా భర్త శవం పక్కనే కూర్చుని ప్రశాంతంగా తన మొబైల్ ఫోన్ చూసుకుంటోంది. అపార్ట్‌మెంట్ తలుపులు బద్దలు కొట్టిన ఆనవాళ్లు లేకపోవడం, ఆ సమయంలో ఇంట్లో వీరి ముగ్గురు తప్ప నాలుగో వ్యక్తి లేకపోవడంతో ప్రియాంకయే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

ఈ మిస్టరీ వెనుక ఒక హై-డ్రామా నడిచింది. బుధవారం రాత్రి డాక్టర్ కిరణ్ స్నేహితులు, బంధువులు ఆయనకు వరుసగా ఫోన్లు చేయగా.. భార్య ప్రియాంక ఆ ఫోన్లు ఎత్తి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని  అబద్ధాలు చెబుతూ బురిడీ కొట్టించింది. ఎంతకీ కిరణ్ దొరకకపోవడంతో అనుమానం వచ్చిన ఒక బంధువు నేరుగా ఫ్లాట్‌కు వెళ్లి చూడటంతో ఈ భయంకరమైన నేరం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్.. ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Continues below advertisement

పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రియాంక ప్రవర్తన ఒక పక్కా సైకో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అరెస్ట్ చేసిన సమయం నుండి ఆమె తీవ్రమైన షాక్‌లో ఉన్నట్లు నటిస్తూ, పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తోందని పోలీసులు తెలిపారు.  నేను ఇక్కడే కూర్చున్నాను.. ఏం జరిగిందో నాకు తెలియదు.. ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటూ ఆమె పోలీసుల ముందు పదే పదే ఒకే మాటను కలవరిస్తోంది. తాను మానసిక సమస్యల కోసం మందులు వాడుతున్నట్లు కూడా ఆమె పేర్కొంది.   

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును హత్య ,  హత్యాప్రయత్నంగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? అసలు మోటివ్   ఏంటి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వస్తేనే ఈ హత్య ఏ సమయంలో జరిగింది, స్క్రిప్ట్ ఎలా నడిచింది అనే విషయాలపై పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.