Delhi Red fort Blast Case | న్యూఢిల్లీ: నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో NIA మరో నిందితుడిని అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ తెలిపిన ప్రకారం, ఈ నిందితుడు కారు పేలుడుకు ముందు ప్రధాన నిందితుడు, ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి సహకరించాడు. అతనికి ఆశ్రయం కల్పించడంతో పాటు అవసరమైన సహాయం అందించాడని అభియోగాలు ఉన్నాయి.

Continues below advertisement


ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించాడని ఆరోపణలు
ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో తాజాగా అరెస్టు అయిన నిందితుడి పేరు షోయెబ్. అతడు హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ధౌజ్ గ్రామానికి చెందినవాడు. రెండు వారాల కింద ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనకు ముందు వరకు నిదింతుడు షోయెబ్ ఉగ్రవాది ఉమర్‌కు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. దాంతో పాటు ఉమర్‌కు కావాల్సిన అన్ని సమకూర్చినట్లు ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తు తేలింది. ఈ అభియోగాలతోనే నిందితుడు షోయెబ్‌ను బుధవారం నాడు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.


లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చిన ఆరోపణ
ఉగ్రవాది ఉమర్ నబీకి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, అతనికి షోయెబ్ అన్ని రకాల లాజిస్టిక్ సపోర్ట్ కూడా అందించాడని NIA తెలిపింది. ఇందులో వసతి, సామాగ్రి, ఇతర రకాల సహాయం ఉన్నాయి. ఈ కేసులో షోయెబ్ ఏడవ నిందితుడిగా ఉన్నాడు. ఇంతకుముందు NIA ఉమర్ కు సంబంధించిన మరో ఆరుగురు సహచరులను అరెస్టు చేసింది.ఈ చర్య RC-21/2025/NIA/DLI కేసు నంబర్ కింద జరిగింది.


దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి
ఢిల్లీలో ఉమర్ ఆత్మాహుతి దాడికి సంబంధించిన ఆధారాలపై దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పనిచేస్తోంది. అనేక రాష్ట్రాల్లోని స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తులను గుర్తించి,  అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించేందుకు NIA దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే మిగతా నిందితులను, దాడికి ప్లాన్ చేసిన మాస్టర్ మైండ్.. దాడికి కారణాలు దర్యాప్తులో తేలతాయన్నారు.