Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా భావించే ఈస్ట్‌ ఆఫ్ కైలాష్‌లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె, ప్రతిభావంతురాలైన ఐఐటీ గ్రాడ్యుయేట్ తన స్వగృహంలోనే హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులు ఒక 19 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ అధికారి ఇంట్లో గతంలో పని చేసిన వ్యక్తే ఈ పనికి పాల్పడ్డాడు. పనిలో నుంచి తొలగించారనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Continues below advertisement

మంగళవారం నాడు ఆగ్నేయ ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌ ప్రాంతంలో నివసించే ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో తన గదిలో విగత జీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని ఫోన్ ఛార్జ్‌ర వైర్‌తో ఉరివేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆమెపై హత్యకు ముందు అత్యాచారం జరిగినట్టు తేలింది. 

మృతురాలు ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొరబడినట్టు ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. దీనిని బట్టి నిందితుడికి ఆ ఇల్లు , ఆ ఇంటి పరిస్థితులు బాగా తెలుసు అని అనుమానించారు. 

Continues below advertisement

ఈ కేసులో పోలీసులు 19 ఏళ్ల రాహుల్ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి ద్వారకలోని ఒక హోటల్‌లో తలదాచుకుంటుండగా అరెస్టు చేశారు. రాహుల్ గతంలో ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో పని వాడిగా ఉండేవాడు. 

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. బుధవారం ఉదయం 6.28 గంటల సమయంలో రాహుల్ ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిందితుడు ఆల్వార్‌కు చెందిన వాడని, అంతకు ముందే ఢిల్లీకి చేరుకుని, తన వద్ద ఉన్న స్పేర్‌కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. ఆటల కోసం డబ్బులు అవసరమై సమీపంలోని ఇతర పనివాళ్ల వద్ద, చుట్టుపక్కల వారి వద్ద అప్పులు చేసే వాడు, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించకపోవడంతోపాటు అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో, ఆ కుటుంబం సుమారు నెల రోజుల క్రితం అతడిని పనిలో నుంచి తొలగించింది. 

పని నుంచి తీసేయడం, డబ్బుల అవసరం ఉండటంతో రాహుల్ ఈ నేరానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై అత్యాచారం, హత్య, దోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాహుల్‌కు గతంలో కూడా ఒక లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణాలు కోల్పోయిన 22 యువతి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని డీబీఎస్‌ఆర్‌కే పురంలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె నృత్యకారిణి కూడా. చాలా పోటీల్లో అవార్డులు గెలుచుకుంది. 

ఈ ఘటనలో నిందితుడు రాహుల్, ఒక ఐఆర్‌ఎస్ ఆఫీస్‌లో పని చేసే సూపర్ ఇంటెండెంట్ సిఫార్సు ద్వారా పనిలో చేరాడు. అయినా అతను గత చరిత్ర తెలుసుకోకపోవడం తప్పు అయ్యింది. ఇంటి పని మనుషులను నియమించుకునేటప్పుడు కచ్చితంగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలని, స్పేర్ కీలు వంటివి ఇతరుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.