Shamshabad Woman Murder Case Update:
శంషాబాద్ లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మృతురాలిని రాళ్లకు చెందిన మంజుల గా పోలీసులు గుర్తించారు. రిజ్వానా అనే మహిళ మంజులను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన చీరకొంగుతో ఉరివేసి, ఊపిరాడకుండ చేసి చంపినట్లు తెలిపారు. మహిళ హత్య కేసులో రిజ్వానతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


శంషాబాద్ డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను  శనివారం మీడియాకు వివరించారు. డీసీపీ నారాయణ మాట్లాడుతూ.... ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళా మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజుల గా గుర్తించాం. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ లోని హాస్పిటల్ కు వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శంషాబాద్ లోని శ్రీనివాస ఎన్ క్లేవ్ వద్ద సగం కాలిపోయిన గుర్తుతెలియని మహిళ మృతి దేహాన్ని పోలీసులు గుర్తించారు. 


భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహం సరిపోలడంతో హత్యకు గురైంది మంజులగా గుర్తించాము. అయితే మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని విచారణలో తేలింది. రిజ్వానా బేగం అనే మహిళకు మంజుల లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వాన హత్య చేసింది. ముందుగా మంజుల కళ్ళలో కారం కొట్టి ఆమెపై రిజ్వాన దాడి చేసింది. చీర కొంగుతో మంజుల మెడకు గట్టిగా చుట్టి, ఉపిరాడకుండా చేసి హత్య చేసింది రిజ్వానా.


అనంతరం పెట్రోల్ తో మంజుల మృతదేహాన్ని కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రిజ్వానా బేగం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినందుకు రిజ్వానానే ఇదంతా చేసింది. హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. 


మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్నబంగారం చెవుల రింగ్స్, మెడలో ఉన్న తాళిబొట్టు, కాళ్ళ కడియాలు లేవని కుటుంబ సభ్యులు గుర్తించారు. మంజుల వద్ద ఉన్న ఆభరణాల కోసమే హత్య చేశారని తొలుత పోలీసులు భావించారు. కానీ మృతురాలు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం పోలీసు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడింది. మంజులను హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను రిజ్వానా దొంగతనం చేసింది. మంజుల మృతదేహాన్ని శంషాబాద్ లోని శ్రీనివాస ఎన్ క్లేవ్వ వద్దకు తీసుకెళ్లి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు దర్యాప్తులో రిజ్వాన ఒప్పుకుంది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వాన టికెట్స్ కూడా బుక్ చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసుల తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టడంతో నిందితులు దొరికారు.