Dachepalli YCP Candidate Arrest: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది.  ఓటర్లను ఆకర్షించేందుకు, నామినేషన్ రోజు పంచేందుకు భారీగా సిద్ధం చేసిన తెలంగాణ మద్యాన్ని స్థానిక పోలీసులు సీజ్ చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవిని, ఆయన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Continues below advertisement

ఇంట్లో తనిఖీలు.. 429 సీసాల సీజ్ 

ఛైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేసే రోజు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేయడానికి రవి అనుచరుడు బుర్రి అనిల్‌తో పాటు మరికొందరు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలించినట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. దీంతో  దాచేపల్లి ఎస్సై ఖాసింవలి శుక్రవారం తెల్లవారుజామున రవి నివాసంలో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.64,640 విలువైన 429 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు కొప్పుల రవి, బుర్రి అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన సమయంలో నిందితుల ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. "నామినేషన్‌ సందర్భంగా అందరూ మద్యం పంపిణీ చేస్తారు కదా, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే.. కేసు నమోదు చేయకుండా వదిలేయండి" అని కొప్పుల రవి సీఐ ఖాజావలితో వాదనకు దిగడం గమనార్హం. మరోవైపు, ఈ వ్యవహారంతో రవికి ఎలాంటి సంబంధం లేదని, మద్యం తీసుకొచ్చి దాచింది తానేనంటూ ఆయన అనుచరుడు బుర్రి అనిల్ సీఐకి చెప్పి, రవిని వదిలేసి తనను మాత్రమే అరెస్టు చేయాలని కోరాడు. Also Read: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట

Continues below advertisement

పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఆందోళన  

కొప్పుల రవి అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైసీపీ నాయకుడు మురళీధర్‌రెడ్డి పీఎస్ కు చేరుకొని సీఐ ఖాజావలితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆరోపించారు. అయితే చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి ఈ నెల 30 వరకు రిమాండ్ విధించింది.  Also Read: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!