ఒకవైపు వ్యవసాయానికి సంబంధించి రానున్న రోజులకి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న రైతులు, కరెంటు కోతలతో సమస్యలు రాకుండా సోలార్ ప్యానళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు దందాకు తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పీఎం కుసుమ్ యోజన పేరుతో సోలార్ పంప్ సెట్ ను అందిస్తున్నారంటూ ఓ వెబ్ సైట్ ని సృష్టించారు నకిలీ సైబర్ నేరగాళ్లు. వ్యవసాయ పొలానికి సంబంధించిన సోలార్ పంప్ సెట్ లు తక్కువ ధరలోనే అందిస్తామంటూ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దీనిని నమ్మిన నగరానికి చెందిన ఓ న్యాయవాది మోసపోయారు. విడతలవారీగా దాదాపు రూ.5 లక్షలను చెల్లించారు.


పక్కా ప్లానింగ్ వేశారిలా..
మొదట ఈ స్కీంలో చేరాలంటే 25 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంటూ ఓ వ్యక్తి సదరు న్యాయవాదికి ఫోన్ చేశాడు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఆ న్యాయవాది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని ఉండడంతో వారు అడిగిన మొత్తాన్ని మొదట్లో చెల్లించే రుసుముల కింద చెల్లించారు. ఇక అక్కడి నుండి మొదలైంది అసలు సంగతి. డాక్యుమెంట్స్ పూర్తయ్యాయని ఒకసారి, ఇతర ఫీజుల రూపంలో వరుసగా బాధితుల నుండి డబ్బులు వసూలు చేస్తూ పోయారు. 


భారీ మొత్తంలో చెల్లించిన బాధితుడు ఇంకా తనకి పంప్ సెట్ రాకపోవడంతో గురువారం కరీంనగర్లోని (తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరనియ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్) టీఎస్ రెడ్ కో కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న అధికారులను కలిసి తను స్కీమ్ లో చేరిన విషయాన్ని వివరించాడు. అంతేకాకుండా డబ్బులు కూడా చెల్లించినట్లు తన వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపించారు. అయితే అవాక్కైన అధికారులు అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పథకం ఇంకా అమలు కావడం లేదని ఇప్పటి వరకూ అతను చేసిన డబ్బులకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 


అంతేకాకుండా అది నకిలీ వెబ్ సైట్ అంటూ గుర్తించిన TS Redco పర్యవేక్షణ అధికారి లక్ష్మీకాంతారావు చెప్పడంతో బాధితుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకూ జరిగిందంతా మోసం అని గుర్తించిన అతడు తన డబ్బులు జమ చేసిన  నెంబర్లకు ఫోన్ చేయగా ఎటువంటి రిప్లై రాలేదు. పైగా తను నగదు జమ చేసిన ఆన్ లైన్ ఖాతా వివరాలు ఇతర పక్కా ఆధారాలతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు సదరు న్యాయవాది. తన వ్యవసాయ పొలానికి పంపుసెట్టు కోసం వెళితే ఏకంగా ఐదు లక్షల రూపాయలు దోచేశారంటూ బాధితుడు వాపోయాడు. న్యాయవాది అయిన తననే ఇంత పకడ్బందీగా మోసం చేయగలిగారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వాపోయాడు.