డబ్బు సంపాదించడానికి నేరగాళ్లు.. నానా దారులు తొక్కుతున్నారు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువ ఉండటంతో.. దానిపై కన్నేసి ఎలా వీలైతే.. అలా దోచుకుంటున్నారు. కొత్తగా కొంతమందికి అలానే టోకరా వేశారు. మీరు పోర్న్ చూస్తున్నారు... ఫైన్ కట్టాల్సిందేనంటూ.. బురిటీ కొట్టించారు.
ఇంటర్నెట్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి అంటూ కొంతమందికి నోటీసులు వచ్చాయి. వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. వాళ్లకి వచ్చిన బోగస్ పాప్ అప్ నోటీసులను సైతం షేర్ చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన దిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
బోగస్ పాప్ అప్ నోటీసులను టెక్నికల్ టీమ్ కు పంపించారు. అవన్నీ చెన్నై నుంచి వచ్చినట్లు తెలిసింది. ఇక రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. వారం రోజులు చెన్నైకి వెళ్లారు. అక్కడే మకాం వేశారు. నిందితులను గ్రాబ్రియేల్ జేమ్స్, రామ్ కుమార్ సెల్వం, బి.ధీనుశాంత్‌గా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు ఈ ప్రాంతంలో ఒక వారం పాటు క్యాంప్ చేసి, చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, ఊటీ మధ్య 2 వేల కిలోమీటర్లకు పైగా తిరిగారు. ఎట్టకేలకు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని విచారిస్తుంటే మెల్ల మెల్లగా విషయాలు బయటపడ్డాయి. ఈ ముగ్గురూ తమ బాస్ చందర్‌కాంత్ ఆదేశాల మేరకు ఈ పనిచేసినట్లు చెప్పారు. చందర్ కాంత్ కంబోడియాలో ఉంటాడని తెలిపారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. చందర్ కాంత్ పోలీసులకు దొరికిన ధీనుశాంత్ సోదరుడు.
పోలీసులు తమదైన స్టైల్ విచారణ చేస్తుంటే.. ధీనుశాంత్ నిజాలు చెప్పాడు. బోగస్ పోలీసు నోటీసులు, ఇంటర్నెట్ వినియోగదారులకు వాటిని పంపించడం లాంటి.. సాంకేతిక విషయాలన్నీ చందర్ కాంత్ చెస్తుంటాడని చెప్పుకొచ్చాడు. కంబోడియా నుంచి వీటన్నింటీని ఆపరేట్ చేస్తాడని తెలిపాడు. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్.. ఫ్రాడ్ చేసి తరలించడానికి 20కి పైగా బ్యాంకు ఖాతాలు ఉపయోగించినట్లు చెప్పాడు.
పట్టుబడిన ముగ్గురు నిందితులు.. ఈ ఏడాదిలో యూపీఐ ఐడీలు, బోగస్ నోటీసులతో క్యూ ఆర్ సంకేతాలతో రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారు. ఇలా మోసం చేసి సంపాదించిన డబ్బును అంతా.. క్రిప్టోకరెన్సీ ద్వారా తరలించేవారు. డబ్బను దాచిపెట్టేందుకు చాలా ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇలాంటి ముఠాలు డబ్బులు కోసం ఎలాంటి పనైనా చేస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్ వాడే వారు జాగ్రత్తగా ఉండాలని.. ఇలా ఏవైనా బెదిరింపులు వస్తే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.