Cyber Crime: సజ్జనార్ పేరుతో మోసం! ₹20,000 స్వాహా.. మీరూ జాగ్రత్త! సైబర్ నేరగాళ్ల కొత్త టెక్నిక్
సైబర్ క్రిమినల్స్ ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుత అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ పేరును వాడుకుని, ఆయన స్నేహితుడిని బురిడీ కొట్టించి ₹20,000 కొట్టేశారు.

సైబర్ క్రిమినల్స్ ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరును వాడుకుని, ఆయన స్నేహితుడిని బురిడీ కొట్టించి ₹20,000 కొట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా వీసీ సజ్జనార్ తన ఫేస్‌బుక్ ద్వారా వివరించారు. "నా పేరు వాడుకుని ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమేనని నమ్మి నా స్నేహితుడు ఒకరు ₹20,000ను మోసగాళ్ల ఖాతాకు పంపారు," అని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
అసలు ఖాతా ఇదే
"తన వ్యక్తిగత ఫేస్‌బుక్ పేజీ లింక్ https://www.facebook.com/share/1DHPndApWj/. ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీ నకిలీవే. ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ తొలగించే పనిలో ఉంది," అని సజ్జనార్ వివరించారు.
ప్రజలకు సజ్జనార్ సూచనలు
- "నా పేరుతో, లేదా ఏ అధికారి/ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లకు స్పందించవద్దు."
- "డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మవద్దు."
- "ఒకవేళ ఎవరైనా డబ్బులు పంపమని మెసేజ్‌లు చేస్తే, ముందుగా ఫోన్ ద్వారా ఆ వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించాలని" ఆయన కోరారు.
- అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు.
- సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.





















