Constable Murder by a rowdy sheeter in Nizamabad: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రమోద్ (48)ను రౌడీషీటర్ షేక్ రియాజ్ (24) కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ ప్రాంతంలో, ఐవీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
షేక్ రియాజ్ వాహన దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లో నిందితుడు. ఆయనపై రౌడీ షీట్ ఉంది. ఓ కేసులో ఆయనను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. పోలీసులు రాగానే బుద్దిగా లొంగిపోయినట్లుగా నటించి బండి ఎక్కాడు. కానిస్టేబుల్ ప్రమోద్ డ్రైవ్ చేస్తూండగా మరో కానిస్టేబుల్ వెనుక కూర్చున్నారు. బుద్దిగా స్టేషన్ కు వస్తున్నారని రౌడీ షీటర్ వద్ద ఆయుధాలు ఉన్నాయో లేవో చెక్ చేయలేదు. కానీ అతని వద్ద పదునైన కత్తి ఉంది. స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో వినాయక్‌నగర్ సమీపంలో రియాజ్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేశాడు. డ్రైవ్ చేస్తున్నప్పుడు కత్తితో దాడి చేయడంతో కిందపడిపోయారు. ఆ సమయంలో జనం గుమికూడారు. అయినా అందరూ వీడియోలు తీయడానికి ప్రయత్నించారు కానీ కాపాడే ప్రయత్నం చేయలేదు. ఛాతీలో పొడిచిన గాయాలతో ప్రమోద్ ఆసుపత్రికి తరలించినా, అక్కడ మరణించారు. దాడి చేసిన రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు.
తెలంగాణ డీజీపీ ఈ ఘటనపై స్పందిస్తూ, రియాజ్‌ను పట్టుకోవడానికి ఇంటెన్సివ్ మాన్‌హంట్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు రియాజ్‌ను వెతకడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.ఈ ఘటన నగరంలో షాక్ కలిగించింది మరియు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో విషాదాన్ని నింపింది. ప్రమోద్ మరణంపై పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. రియాజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ సాయిచైతన్య స్పందించారు. కానిస్టేబుల్ ను హత్య చేస్తూంటే ఒక్కరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. అందరూ ఫోన్లలో వీడియోలు తీయడానికి టైం కేటాయించారన్నారు. పోలీసులు అని కాకుండా ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయి ఉంటే సాయం చేసే గుణం సామాన్య ప్రజలకు ఉండాలని సీపీ సూచించారు. ఆపద సమయంలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటేనే ప్రాణాలు నిలబడతాయన్నారు. మాకెందుకునే అనే పరిస్థితి ఉండకూడదని వివరించారు. అహోరాత్రులు ప్రజల సేవకే పనిచేస్తున్నామని,కమిషనరేట్ పరిధిలో పోలీస్‌శాఖ అహోరాత్రులు కృషి చేస్తోందన్నారు.