Congress War Room Case : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో వ్యూహకర్త సునీల్ కనుగోలును సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. దాదాపు రెండు గంటల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టింగ్ లపై ఆరా తీశారు. ఈ పోస్టులకు సంబంధించి సునీల్‌ కనుగోలు నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మరోసారి సునీల్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌ 24న మాదాపూర్ సునీల్‌ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేసి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ సీజ్ చేశారు. సునీల్‌ కనుగోలు కింద పనిచేస్తున్న మెండా శ్రీ ప్రతాప్‌, శశాంక్‌, ఇషాంత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇచ్చిన వివరాలు ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు ధ్రువీకరించారు.  


మల్లు రవికి నోటీసులు 


కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ 41A కింద మల్లు రవికి నోటీసులు అందజేశారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆఫీస్, వార్‌ రూంపై పోలీసులు తనిఖీలు చేశారు. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర పరికరాలను సీజ్ చేశారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను మల్లు రవి, షబ్బీర్ అలీతోపాటు కొంతమంది నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మల్లురవికి పోలీసులు సోమవారం నోటీసులు జారీచేశారు. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో అసలేం జరుగుతుంది? అక్కడ ఏం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? పూర్తి వివరాలపై విచారణ చేసేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. 


అసలేం జరిగింది? 


తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఎస్కే కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్‌లు సీజ్ చేశారు పోలీసులు. సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యాలయం సీజ్ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సునీల్ ఆపన్నహస్తం పేరిట రెండు ఫేస్ బుక్ పేజ్ లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారన్న కారణంతో ఎస్కే ఆఫీస్‌పై దాడి చేశారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌, శశాంక్‌, ఇషాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్‌ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. వారికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేసి విచారించారు.