Confident Group chairman C J Roy dies by suicide: ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు ,ఛైర్మన్ సి.జె. రాయ్  బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన పారిశ్రామిక వేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం ఉదయం బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్డులో ఉన్న కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన, తన గదిలోకి వెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. చాలా సేపటి వరకు ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా, ఆయన మృతి చెంది ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Continues below advertisement

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన తన కార్యాలయంలే తుపాకీతో కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు , మానసిక ఒత్తిడి కారణంగానే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మరణం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు ఇటీవల ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని..  విచారణకు హాజరై వచ్చిన తర్వాతనే ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.  

సి.జె. రాయ్  ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు, జనవరి 27న ఆయన నివాసం ,  కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు మూడు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో పెద్ద ఎత్తున పత్రాలను,  డిజిటల్ సాక్ష్యాధారాలను అధికారులు పరిశీలించారు. ఈ దాడుల వల్ల ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని, తన వ్యాపార సామ్రాజ్యం ,  ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళనలో ఉన్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. పోలీసులకు లభ్యమైన డెత్ నోట్‌లో కూడా ఐటీ దాడుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ ఒత్తిడిని తాను భరించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని చెబుతూనే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను కుంగదీశాయని ఆయన అందులో వివరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.   

Continues below advertisement

కేవలం ఐటీ దాడులే కాకుండా, ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఒకవైపు ప్రాణాంతక వ్యాధి, మరోవైపు వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల నిఘా వెరసి ఆయనను బలవన్మరణానికి పురికొల్పాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు కారణాల వల్ల ఏర్పడిన తీవ్ర ఒత్తిడి వల్లే ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు ప్రస్తుతం ఆయన మొబైల్ ఫోన్ డేటా , ఐటీ దాడులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయనను విచారించిన తీరుపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త ఇలా ప్రభుత్వ సంస్థల సోదాల తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

సి.జె. రాయ్ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ , కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో చెరగని ముద్ర వేశారు. ఆయన నేతృత్వంలోని కాన్ఫిడెంట్ గ్రూప్ వందలాది నివాస సముదాయాలను నిర్మించడమే కాకుండా, విద్యా సంస్థలు, ఆతిథ్య రంగం ,  మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించింది. కేరళలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు ,  పారిశ్రామికవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.