Commissioner Sajjanar issues key warnings to men: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అశ్లీల ప్రకటనలు, హనీట్రాప్ ఉచ్చుపై పోలీస్ కమిషనర్  వి.సి. సజ్జనార్ మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా యువతను, ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసురుతున్న ఈ  డిజిటల్ వల"  పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఆకర్షణీయమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడవచ్చంటూ వచ్చే ప్రకటనల వెనుక ఉన్నది తీయని మాటలు కాదని, మిమ్మల్ని నిలువునా దోచేసే కుట్ర అని ఆయన స్పష్టం చేశారు.

Continues below advertisement

ఈ ప్రకటనల్లో కనిపించే దృశ్యాలన్నీ వాస్తవం కాదని, అవి కృత్రిమ మేధ   సాయంతో సృష్టించిన నకిలీ వీడియోలని సజ్జనార్ వివరించారు. ఈ ప్రకటనల్లో ఉండే లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన వెంటనే, బాధితుల ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ వంటి వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కేవలం ఒక క్లిక్‌తో మీ ప్రైవసీని సైబర్ కేటుగాళ్లకు తాకట్టు పెట్టినట్లేనని ఆయన హెచ్చరించారు.

వీడియో కాల్స్ ద్వారా సాగే సెక్స్‌టార్షన్ (Sextortion) మోసాల గురించి ఆయన వివరణాత్మక హెచ్చరిక చేశారు. రాత్రివేళల్లో ఈ యాప్స్ ద్వారా కాల్ చేసినప్పుడు, అవతలి వైపు న్యూడ్ వీడియోలను ప్లే చేస్తూ, బాధితుల ముఖాలను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి, బాధితుల బంధువులకు, స్నేహితులకు పంపిస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత డబ్బు ఇస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన వివరించారు.      

Continues below advertisement

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరూ ఊరికే స్నేహితులు కారని, ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, గౌరవాన్ని కొల్లగొట్టే భారీ కుట్ర దాగి ఉంటుందని ప్రజలు గ్రహించాలని సూచించారు. క్షణికావేశంలో తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుని ఉంటే, భయపడి ఆత్మహత్య వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. వెంటనే 1930  టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా  cybercrime.gov.in  పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.  బీ అలర్ట్  అంటూ ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.