Chittoor Accident : చిత్తూరు జిల్లా మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. పెద్దపంజని మండల కేంద్రం వద్ద  మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ లో ముందు వెళ్తున్న పోలీసు వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అయితే ద్విచక్ర వాహనం వెనుక వైపు వస్తున్న టమాటా లోడ్ తో వస్తున్న టాటాఏసీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలోని డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ‌ ప్రమాదంలో పోలీసు వాహనంలోని డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. కాన్వాయ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనం వస్తుండడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న మంత్రి‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనం దిగి సంఘటన స్థలాన్ని ‌ పరిశీలించారు. 



మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం 


మధ్యప్రదేశ్‌లోని రేవాలో మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 30పై ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం-శనివారం (అక్టోబర్ 21-22) మధ్య రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో జబల్‌పూర్ నుంచి రేవా మీదుగా ప్రయాగ్ రాజ్  వెళ్తోన్న బస్‌ ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సోహగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను త్యోంథర్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. 


హైదరాబాద్ వెళ్తోన్న బస్సు 


సుహాగి హిల్ సమీపంలో బస్సు, ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. గాయపడిన 40 మందిలో 20 మందిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి గోరఖ్ పూర్ కు చేరుకోవాల్సి ఉందని ఎస్పీ తెలియజేశారు. బస్సులో ఉన్నవారు యుపి, బీహార్, నేపాల్ నుంచి వచ్చారు. సుహాగి కొండపై నుంచి దిగుతుండగా ట్రాలీ మొదట ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత ఆ ట్రక్‌ను బస్సు ఢీకొందని రేవా ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్, గోండా, గోరఖ్ పూర్ వాసులుగా సమాచారం అందుతోంది. సమాచారం ప్రకారం బస్సులో 100 మందికి పైగా ఉన్నారు. పండుగ రోజున ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 


సీసీటీవీ సాయంతో 


ప్రమాదం జరిగిన తరువాత, బస్సు, ట్రక్కు అక్కడికక్కడే ఉన్నాయని, మూడో వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. సమీపంలోని టోల్ ప్లాజాలోని సిసిటివి కెమెరాల సహాయంతో మూడో వాహనం ఎటువైపుకు వెళ్లిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి, గాయపడిన వారు కూలీలుగా చెబుతున్నారు.  ఈ ప్రమాదం గురించి ఉత్తరప్రదేశ్, బీహార్ లోని అధికారులకు సమాచారం అందించారు. మృతుడి ఆచూకీ త్వరలోనే వెల్లడిస్తాం. బ్రేకులు వేయకపోవడం వల్లే  ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం కారణంగా బస్సులో ఇరుక్కుపోయిన వారిలో కొందరి చేతులు, కాళ్లు తెగిపోయాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.