Chittoor Crime: మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చి పోతున్నారు. పసికందుల నుంచి పండు ముసలి వరకూ ఎవరిని వదిలి పెట్టడం‌ లేదు మృగాళ్లు. వయస్సుతో తేడా లేకుండా మహిళలపై దాడులకు దిగుతూ ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. చిత్తూరు జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన మహిళా దినోత్సవం నాడే వెలుగుచూసింది. 


మహిళపై దాడి, ఆపై హత్య 


చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం ఊటబావులపల్లె గ్రామానికి చెందిన మహిళ తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. రెండు సంవత్సరాల క్రితం ఆమె భర్త బతుకుదెరువు కోసం కోవైట్ కు వెళ్లాడు. దీంతో ఇంటి వద్ద ఖాళీగా లేకుండా రెండు పాడి ఆవులను తీసుకుని వాటిని‌ మేపుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది. ఈ క్రమంలో పశువులకు మేత కోసం సోమవారం సాయంత్రం గడ్డిని తీసుకుని‌ వచ్చేందుకు గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. అయితే పశువుల గడ్డి సేకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తమ కోరిక తీర్చలేదని కోపోద్రిక్తుడైన వ్యక్తి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనసూయ శవాన్ని పొలానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డేశారు. 


దిక్కుతోచని స్థితిలో చిన్నారులు


అయితే ఇంటి వద్ద అమ్మ కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు ఎంత సేపటికి అమ్మ రాకపోయే సరికి ఇంటి ప్రక్కనే ఉన్న బంధువులకు చెప్పారు. దీంతో రాత్రంతా గ్రామస్తులు ఆమె కోసం గాలించారు. కానీ మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం మరొకసారి ఆమె కోసం గాలించారు. అయితే గ్రామానికి శివారు ప్రాంతమైన పాడుబడ్డ బావిలో మహిళ మృతిదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల కోసం పీలేరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆకస్మిక మరణంలో ఆ ఇద్దరు పిల్లలకు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లి మృతదేహం వద్ద చిన్నారుల రోధనను చూసి గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హత్య కేసులో గ్రామస్తుల సమాచారం మేరకు మహిళ సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.