Chittoor Crime : మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి ప్రదేశాల్లో, పొలాల వద్ద ఇళ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడమే అతని హాబీ. దొంగతనాలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరికి అనుమానం రాకుండా మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటాడు. దోచుకున్న నగదు ఖాళీ కాగానే తిరిగి దొంగతనాలకు పాల్పడి మరో మారుమూల గ్రామానికి వెళ్లేవాడు. ఇలా ఏళ్ల తరబడి నాలుగు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా, భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాలు ఇలా
చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. జిల్లాలో ఇటీవల పంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో పొలాల దగ్గర ఉన్న ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టత్మకంగా తీసుకొన్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రెండు నెలల నుంచి ఈ కేసును దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా పలమనేరు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పంజాణి మండలం పలమనేరు– మదనపల్లి రోడ్డులోని కళ్లుపల్లి క్రాస్ వద్ద నిందితుడుని అరెస్టు చేశారు.
ఒంటరి ఇల్లే టార్గెట్
ఈ కేసులో నిందితుడు తమిళనాడు కళ్ళకురుచి జిల్లా తిమ్మలై గ్రామానికి చెందిన K.మురుగన్ అలియాస్ కరుపు మురుగన్ గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి నిందితుడి నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ½ kg ల వెండి, మొత్తం రూ.11,50,000 విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత రెండు సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని పొలాల వద్ద ఒంటరి ఇండ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవాడు. భారీ మొత్తాలను దోచుకొని జల్సా చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. నిందితుడు నేరం చేసిన ప్రతీసారి ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో దాక్కునేవాడు. తన వద్ద డబ్బులు అయిపోయాక మళ్లీ నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. ఇతనిపై సుమారు నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 40 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అయితే నిందితుడు చిత్తూరు జిల్లాలో రాళ్ళబుదుగురు, బంగారుపాళ్యం, జీడి నెల్లూరు, పలమనేరు, కుప్పం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. చిత్తూరులో దొంగతనాలపై నిఘా పెట్టామన్నారు. బోర్డర్ రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి పట్టుకునే డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
(నిందితుడు మురుగన్)