ఆ అమ్మాయి తల్లికి క్యాన్సర్. అమ్మను ఎలాగైనా బతికుంచుకోవాలనుకుంది. కష్టం చేస్తూ.. తాను సంపాదించిన దాంట్లో.. కాస్త దాచుకుంది. ఇంకొంత డబ్బు అప్పు చేసింది. తల్లిని ఆసుపత్రిలో చూపించాలంటే.. మరికొంత డబ్బు కావాల్సి ఉంది. దానికోసం చాలా ప్రయత్నాలు చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళకు ఓ ఫోన్ వచ్చింది. 25 లక్షలు గెలుచుకున్నారు. కానీ మీరు కొంత డబ్బులు కట్టాలని చెప్పి నమ్మించారు. 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో మీరు విజేతగా నిలిచారు. రూ.25 లక్షలు గెలుచుకున్నారని చెప్పడంతో తల్లికి వైద్యం చేయిద్దామనుకుంది. వల విసిరింది సైబర్‌ నేరగాళ్ల(Cyber Crime)ని తెలుసుకోలేక రూ.8 లక్షలు కోల్పోయింది. నిజమే అనుకుని నమ్మి.. తల్లి వైద్యం కోసం దాచిన సోమ్మును పోగొట్టుకుంది. 


హైదరాబాద్​ జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్‌కు చెందిన మహిళకు ఈనెల 9న ఓ ఫోన్‌ వచ్చింది. నేను విజయ్‌కుమార్‌ను మాట్లాడుతున్నా కౌన్ బనే గా కరోడ్ పతి నుంచి.. మీరు 25 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని చెప్పారు. ఖాతా నంబరు అడగ్గా.. ఆ మహిళ తన స్నేహితుల అకౌండ్ నంబర్ ఇచ్చింది. ప్రొసెసింగ్ ఫీజు.. అవీ ఇవీ కారణాలు చెప్పి.. రూ.2 లక్షలు చెల్లించాలనడంతో మీ సేవా కేంద్రం నుంచి వారు చెప్పిన ఖాతాకు పంపింది. మళ్లీ 15వ తేదీన మళ్లీ ఓ ఫోన్ వచ్చింది.  తాను సునీల్‌మెహతా అని, కౌన్‌ బనేగా కరోడ్‌పతికి విచారణ అధికారిని అన్నాడు. కరెన్సీ మార్పు కోసం రూ.75 వేలు చెల్లించాలని చెప్పడంతో చెల్లించింది. 16న మకొకరు ఫోను చేసి.. రూ.25 వేలు చెల్లించాలనడంతో పంపించింది.


17న సునీల్‌ మెహతా మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రైజ్‌ మనీ పంపించాం. ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఆపేశారని చెప్పాడు. సెటిల్‌మెంట్‌ చేసుకోమని చెప్పాడు. రెండు బ్యాంకు ఖాతాలను పంపించి.. రూ.1.25 లక్షలు చెల్లించాలని సూచించడంతో ఆ మొత్తం పంపించింది. 18వ తేదీన 1.30 లక్షలు, 21న మరికొంత డబ్బులు తెలివిగా తీసుకున్నారు. మెుత్తం ఈ ఎపిసోడ్ లో బాధితురాలు రూ.8,18,000 చెల్లించింది. మళ్లీ ఫోను చేసి నగదు కావాలని అడుగుతుండటంతో మోసపోయినట్లు గ్రహించి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరైనా మళ్లీ మళ్లీ ఫోన్ చేసి విసిగిస్తే.. దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎలాంటిది లేకుండా డబ్బులు ఎవరూ ఇవ్వరూ అనే విషయం గుర్తుంచుకోవాలి. రోజుకో రూట్ లో ఇలా సైబర్ నేరాలు చేస్తూ.. తప్పించుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అమాయకులను బుట్టలో వేసుకుని మోసం చేస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్లే.. ఇలాంటి మోసాల బారిన పడుతుంటడం దారుణం.