Centre Forms Multi Agency Panel to Probe Digital Arrest Scams: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ తరహా సైబర్ నేరాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు వివిధ దర్యాప్తు సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి మల్టీ-ఏజెన్సీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగడానికి కొన్ని రోజుల ముందే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీకి స్పెషల్ సెక్రటరీ అధ్యక్షత వహించనున్నారు.
ఈ కమిటీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఢిల్లీ పోలీసు విభాగాలకు చెందిన ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్, మరియు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖల నుండి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు, భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సభ్యులు, , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తారు.
డిజిటల్ అరెస్ట్ మోసాల తీరుతెన్నులు, వాటి వెనుక ఉన్న విదేశీ మూలాలు, ఆర్థిక లావాదేవీల మార్గాలు , సాంకేతిక లోపాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. హర్యానాకు చెందిన ఒక వృద్ధ దంపతులు దర్యాప్తు అధికారులమని నమ్మించి మోసగాళ్లు తమను రూ. కోట్లలో దోచుకున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు కోర్టు ముద్రలు, చట్టబద్ధమైన సంస్థల పేర్లను వాడుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడాన్ని సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థపై దాడి గా అభివర్ణించింది.
కేంద్రం ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్ కేవలం దర్యాప్తుకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సిఫార్సులు చేస్తుంది. ముఖ్యంగా బ్యాంకులు, టెలికాం సంస్థలు , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై కఠినమైన జవాబుదారీతనాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. బాధితులకు నష్టపరిహారం అందించడం మరియు వారిని సైబర్ దాడుల నుండి రక్షించేందుకు ఒక ఏకీకృత జాతీయ వ్యూహాన్ని ఈ కమిటీ రూపొందించనుంది. దీనికి సంబంధించి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించేందుకు కేంద్రం సుప్రీంకోర్టును నెల రోజుల సమయం కోరింది.