Maharashtra Clini : మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో ఆ ఆస్పత్రిలో జరిగిన దాడుల వ్యవహారం వీడియోలు వైరల్ గా మారాయి. బాలచిత్కా క్లినిక్ అనే ఆస్పత్రిలో రిసెప్షనిస్టుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ సీసీ ఫుటేజీ వైరల్ గా మారింది. కానీ మొదట ఆ రిసెప్షనిస్టే ఆ యువకుడి తల్లిపై చేయి చేసుకున్నట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
గోకుల్ ఝా అనే వ్యక్తి తన తల్లితో పాటు ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ రిసెప్షనిస్ట్ సోనాలి కలసరే .. డాక్టర్ మీటింగ్ లో ఉన్నందున వెయిట్ చేయాలని కోరింది. చాలా మంది రోగులు ఉన్నందున క్యూలో ఉండమని కోరింది. అయితే గోకుల్ ఝా అపాయింట్‌మెంట్ లేకుండా డాక్టర్ క్యాబిన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాన్ని రిసెప్షనిస్టు అడ్డుకుంది. ఈ సందర్భంలో, ఝా కలసరేను దూషించి, ఆమెపై శారీరక దాడి చేశాడని, ఆమె జుట్టు పట్టుకుని లాగి, కాలితో తన్నాడని ఆరోపణలు వచ్చాయి. సీసీ ఫుటేజీ వైరల్ అయింది.
అయితే కొత్త సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజ్‌లో, సోనాలి కలసరే గోకుల్ ఝా తల్లితో వాగ్వాదంలో పాల్గొని, ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తుంది. తల్లిపై దాడి చేయడంతో మరింత దూకుడుగా వచ్చి గోకుల్ దాడి చేశాడు. ఈ దాడుల్లో రెండు వైపులా తప్పు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సోనాలి కలసరే ఫిర్యాదు ఆధారంగా, మాన్‌పడా పోలీసు స్టేషన్‌లో గోకుల్ ఝా పై భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్ల కింద దాడి, అసభ్యకరమైన భాష వాడటం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటన అనంతరం ఝా పరారీలో ఉన్నారు.
కొత్త వీడియో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత కేసులను మళ్లీ పరిశీలించాలని డిమాండ్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. గోకుల్ ఝా అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకు వస్తే ఆమె రిసెప్షనిస్టు దాడి చేయడం ఏమిటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.