స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల ముందు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న CISF & ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు ఏఎన్ఐ మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి పుణేకు స్పైస్ జెట్ విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా, అంతకు కొన్ని నిమిషాల ముందు విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది.






ఫ్లైట్ సిబ్బంది విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించివేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ టీమ్ స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు చేపట్టింది. అయితే తమకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్రయాణికుల భద్రత పట్ల అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.