JCB Driver Damaged Toll Plaza In UP: టోల్ ఛార్జీ అడిగినందుకు ఓ వ్యక్తి ఏకంగా టోల్ బూత్‌నే బుల్డోజర్‌తో ధ్వంసం చేశాడు. ఈ దారుణ ఘటన యూపీలో (UttaraPradesh) జరిగింది. రాష్ట్రంలోని హపూర్ (Hapur) జిల్లాలో పిల్కువా ప్రాంతంలో ఛాజార్సి టోల్ బూత్ వద్ద ఉదయం ఓ బుల్డోజర్ వచ్చి ఆగింది.  ఈ క్రమంలో జేసీబీ డ్రైవర్‌ను టోల్ ఛార్జీ చెల్లించాలని టోల్ సిబ్బంది అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు డ్రైవర్ టోల్ ప్లాజా వద్ద బీభత్సం సృష్టించాడు. రెండు టోల్ బూత్‌లతో పాటు సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడు. దీన్ని చూసిన టోల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. సదరు వ్యక్తి బుల్డోజర్‌తో విధ్వంసం సృష్టించిన తీరును వీడియో తీసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుల్డోజర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతను తాగి ఉన్నాడని.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.