Bhimavaram News : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యార్థుల మధ్య మొదలైన ఘర్షణలో ఓ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేస్తుండగా వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. హాస్టల్ రూమ్‌లో అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలు, పీవీసీ పైపులతో దాడికి పాల్పడ్డారు. ఐరన్ బాక్సుతో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  


విద్యార్థికి తీవ్రగాయాలు 


భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు.  రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిపై దాడికి పాల్పడుతూ వీడియో తీశారు. బాధిత విద్యార్థి ప్లీజ్‌ అని వేడుకున్నప్పటికీ కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. 


ప్రేమ విషయంలో గొడవ! 


భీమవరంలోని హాస్టల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ విద్యార్థిపై నలుగురు విద్యార్థులు దారుణంగా చితకబాదారు. అంతేకాదు ఐరన్ బాక్స్‌తో ఛాతిపై వాతలు పెట్టారు. ఈ దాడిలో విద్యార్థికి తీవ్రగాయాలయ్యారు. ప్రేమ విషయంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.  ఈ ఐదుగురు విద్యార్థులు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్‌ కాలేజీ చదువుతున్నారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదుతో నలుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఐదుగురు విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కలిసి తమ కుమారుడిపై దాడి చేయడం దారుణమని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. విద్యార్థిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి.  


హైదరాబాద్ లో మరో ఘటన


అప్పుడే కళాశాలలో అడుగుపెట్టిన జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలికి, మేమున్నామంటూ భరోసా కల్పించాల్సిన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు. ఎంసెట్ లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నెన్నో ఆశలతో క్యాంపస్ లోకి వచ్చిన వారిపై తమ ప్రతాపం చూపించారు. ఈ వేధింపులను తట్టుకోలేని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా.. అంతర్గత కమిటీ వేసి బాధితులు చెబుతున్న మాటలు ఆరోపణలు కాదని, నిజంగానే సీనియర్లు వారిని వేధింపులకు గురి చేసినట్లు తేల్చారు. బాధ్యులైన నాలుగో సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న 34 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ నుండి సస్పెండ్ చేశారు. వీరిలో 25 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుండి మరో 9 మంది స్టూడెంట్స్ ను హాస్టళ్ల నుంచి అలాగే విశ్వ విద్యాలయంలోని వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధం విధించింది  హైదరాబాద్ పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయం. 


సీనియర్లు వేధిస్తున్నారంటూ ప్రన్సిపాల్ కు ఫిర్యాదు 


రాజేంద్రనగర్ లోని పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న 34 మంది విద్యార్థులు... ఇటీవలే క్యాంపస్ లో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. నానా రకాలుగా జూనియర్ విద్యార్థులను తీవ్రంగా హింసించారు. వారి వేధింపులు తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు.. వాళ్లు పడుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వ విద్యాలయ ప్రిన్సిపాల్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జూనియర్ విద్యార్థులు చేసిన ఆరోపణలపై ప్రిన్సిపల్ ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేశారు. వేధింపులు ఎదుర్కొన్న జూనియర్ విద్యార్థులతో పాటు, ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్లను, మిగతా విద్యార్థులను సైతం ప్రొఫెసర్ల కమిటీ విచారించింది.