Bengaluru techie murder: బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో వెలుగుచూసిన యాక్సెంచర్ టెక్కీ శర్మిళ కుశలప్ప మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. మొదట షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా భావించిన ఈ ఘటన, చివరకు పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు మరెవరో కాదు.. ఆమె పక్కింటిలో నివాసముంటున్న 18 ఏళ్ల పీయూసీ విద్యార్థి కర్నల్ కురై అని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
34 ఏళ్ల శర్మిళపై 18 ఏళ్ల కర్నల్ కురై కన్ను
పోలీసుల కథనం ప్రకారం, జనవరి 3వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు కర్నల్, శర్మిళ ఉంటున్న ఫ్లాట్ కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసి, అసభ్యంగా ప్రవర్తించబోగా శర్మిళ తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె కేకలు వేయడంతో భయపడిన నిందితుడు, ఆమె నోరు , ముక్కును గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. ఈ పెనుగులాటలో శర్మిళ ఊపిరాడక స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మరణించింది.
నేరాన్ని కప్పిపుచ్చేందుకు మరింత ఘోరమైన నేరం
హత్య జరిగిన తర్వాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. శర్మిళ మృతదేహంపై ఉన్న రక్తం మరకలను తుడిచివేసి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆమె దుస్తులకు నిప్పు పెట్టాడు. ఆ మంటలు క్రమంగా ఫ్లాట్ అంతటా వ్యాపించాయి. దీంతో అందరూ ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదమని భావించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరపై ఉన్న గాయాలు, మంటలు అంటుకోకముందే ఆమె మరణించడం వల్ల ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లకపోవడం వంటి ఆధారాలు పోలీసులకు అనుమానం కలిగించాయి.
చిన్న క్లూల ఆధారంగా నిందితుడి పట్టివేత
పోలీసులు ఈ కేసులో టెక్నికల్ , డిజిటల్ సాక్ష్యాలను సేకరించారు. శర్మిళ కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పక్కింటి యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం అతడిపై హత్య , అత్యాచార ప్రయత్నం , సాక్ష్యాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన బెంగళూరులో టెక్కీల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.