RGUKT Basara IIIT Student Commits Suicide: ముధోల్: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో గల ఆర్జీయూకేటీ బాసరలో  ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్(EEE) వ్యక్తిగత కారణాలతో బలవన్మరణం చెందాడు. స్టూడెంట్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య (Student Suicide at Basara IIIT) పట్ల వీసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటు వేయడానికి అవుట్‌పాస్ జారీ చేయాలని అభ్యర్థించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విద్యార్థి ఔట్‌పాస్ తీసుకున్నాడు. ఈ రోజే ప్రవీణ్ ఇంటికి బయలుదేరాల్సి ఉంది. నేటి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశాడు. విద్యార్థి తన గదిలో కాకుండా  BH-II ఖాళీ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ప్రవీణ్  BH1 వసతి గృహంలో ఉంటున్నాడని సిబ్బంది చెబుతోంది. విద్యార్థి ఆత్మహత్యతో క్యాంపస్ లో విషాదం నెలకొంది. ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తదుపరి చేపట్టవలసిన చర్యలను డైరెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.


ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి హాస్టల్లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని చనిపోయాడు. పోస్టుమార్టం కోసం అతడి మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కుటుంబ సభ్యులకు సమాచారం తేలవడంతో వారు హుటాహుటీన ఇక్కడికి బయలుదేరినట్లు సమాచారం. కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో ఇదివరకే పలువురు విద్యార్ధిని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా ప్రవీణ్ కుమార్ అనే ఇంజినీరింగ్ ఫస్టియర్ స్టూడెంట్ బలవన్మరణం చెందాడు.


బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటివరకు దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ ఏ ఒక్కరోజూ వారి సమస్యలు పట్టించుకోలేదని, హామీలు తప్పా అమలు చేసింది శూన్యమని కొన్ని నెలల కిందట కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా విమర్శించాయి. ఉమ్మడి ఏపీకి సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం విద్యార్థులు పోటీ పడేవారని, కానీ ప్రస్తుతం విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సైతం పలుమార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.