Bapatla News : బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజాంపట్నం వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి బోటులో 40 మంది బంధువులు విహారయాత్రకు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో నలుగురు చిన్నారులు సముద్రంలో పడిపోయారు. వారిలో ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరో బాలుడిని రక్షించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


అసలేం జరిగింది? 


నిజాంపట్నం వద్ద సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. హార్బర్ నుంచి బోటులో సముద్రంలోకి 40 మంది బంధువులు వెళ్లారు. తెనాలి నుంచి సముద్ర స్నానానికి వీళ్లంతా నిజాంపట్నానికి వెళ్లారు. స్నానాలు చేస్తుండగా ఉద్ధృతమైన అలలు రావడంతో  ఆ అలల తాకిడికి నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఒక పాప మృతదేహం లభ్యం అయింది. కొట్టుకుపోతున్న బాలుడ్ని
వెలికితీశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన చిన్నారుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారికోసం మేరైన్ పోలీస్‌, ఎన్డీఆర్ఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 


మరో ఘటనలో 


బాపట్ల జిల్లా సూర్యలంకలో అలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏరువాక పౌర్ణమి కావడంతో సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని మెరైన్ పోలీసులు పర్యాటకులను హెచ్చరించారు. అయినా కొందరు యువకులు సముద్రంలోకి వెళ్లడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తెనాలికి చెందిన ఏడుకొండలు, చినగంజాం మండలం ములగానివారిపాలేనికి చెందిన హారీష్ రెడ్డి పోలీసులు గుర్తించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. 


కూతురి నోట్లో కుంకుమ కుక్కి  


 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పల్లి గ్రామం.  ఓ ఇంట్లో క్షుద్రపూజల తరహాలో ముగ్గులు వేసి ఉన్నాయి. ఆ ముగ్గుల్లో ఇద్దరు పసివాళ్లను కూర్చోబెట్టి ఉన్నారు. ఓ వ్యక్తి మంత్రాలు చదువుతున్నాడు. పిచ్చి పట్టిన వాడిలా ఉగుతూ పసుపు, కుంకుమలు చల్లుతున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ అరుపులు వినిపించడంతో పక్కన వాళ్లు ఏం జరుగుతుందా అని వచ్చి చూశారు. అక్కడి పరిస్థితుల్ని చూసి ఒక్క సారిగా భయపడ్డారు. పిసిపిల్లలను బలిస్తాడేమోనని అతన్ని ఎదిరించి తీసుకెళ్లబోయారు. అయితే ఓ పాపను బలవంతంగా తీసుకురాగలిగారు. మరో పాప కోసం కొంత మందిని పోగేసి తీసుకువచ్చే సరికి.. ఆ పాప గొంతులో కుంకుమ కుక్కేశాడు. అతి కష్టం మీద ఆ పాపను కూడా లాక్కుని ఆస్పత్రికి తరలించారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. 


ఆ వ్యక్తి పేరు వేణు. ఆ పిల్లలు అతని పిల్లలే. కవల  పిల్లలు. పేర్లు పూర్విక, పునర్విక. వేణుకి శాంతి పూజలు, క్షుద్ర పూజల పిచ్చి. ఇటీవల అది ముదిరిపోయింది.  నిత్యం ఏదో ఒక లోకంలో ఉండే వేణు..  ఇంట్లో శాంతి పూజలు చేశాడు. ఇద్దరు కవల పిల్లలను ముగ్గులో కూర్చోబెట్టి  బలిచ్చే ప్రయత్నం చేశాడు. అన్నెం పున్నెం ఎరుగని పసిపాపలను శాంతి పూజల పేరుతో తండ్రి బలివ్వబోయాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పెద్దారెడ్డి పల్లికి చెందిన వేణుకి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. వారిద్దరూ కవల పిల్లలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పునర్విక మరణించింది.