Indian origin man Australia exit trafficking charge: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారత సంతతి వ్యక్తి తన భార్యను మోసగించి, ఆమెకు తెలియకుండా వీసా రద్దు చేయించి ఇండియాలోనే వదిలేసిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో నమోదైన ఈ ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక 35 ఏళ్ల భారత సంతతి వ్యక్తి, గర్భవతిగా ఉన్న తన భార్యను పథకం ప్రకారం ఇండియాకు తీసుకువెళ్లి, అక్కడ ఆమెను ఒంటరిని చేసి తిరిగి వచ్చినందుకు గాను ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ అతడిని అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా రాజధాని భూభాగం లో అమల్లో ఉన్న ఎగ్జిట్ ట్రాఫికింగ్ చట్టాల ప్రకారం నమోదైన మొదటి కేసు ఇదే . ఈ నేరం రుజువైతే సదరు వ్యక్తికి గరిష్టంగా 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
నమ్మించి మోసం చేసిన వైనం
బాధితురాలు, నిందితుడు సెప్టెంబర్ 2024లో ప్రసవం కోసం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వెళ్లారు. అక్కడ భార్యను వదిలి, తనకు ఆఫీసులో అత్యవసర పని ఉందని, బాబు పుట్టకముందే తిరిగి వస్తానని నమ్మబలికి ఆయన ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భార్య ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడమే కాకుండా, ఏప్రిల్ 2025లో ఆమెకు తెలియకుండానే ఆమె ఆస్ట్రేలియా వీసా అప్లికేషన్‌ను ఫోర్జరీ పత్రాలతో రద్దు చేయించాడు. తద్వారా ఆమె తిరిగి ఆస్ట్రేలియా రాకుండా అడ్డుకుని, పసిబిడ్డతో సహా ఇండియాలోనే చిక్కుకుపోయేలా చేశాడు.
అమ్మ ఆస్ట్రేలియాలో.. బిడ్డ ఇండియాలో
ఎన్నో కష్టాల తర్వాత బాధితురాలు ఆగస్టు 2025లో ఎలాగోలా ఆస్ట్రేలియా చేరుకోగలిగింది. కానీ, ఆమె కుమారుడు మాత్రం ఇప్పటికీ ఇండియాలోనే ఉండిపోయాడు. తిరిగి ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగలేదు. తనను మళ్లీ బలవంతంగా ఇండియాకు తీసుకువెళ్లి అక్కడ వదిలేస్తాడన్న భయంతో ఆమె మార్చి 2026లో పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఏఎఫ్పీ అధికారులు ఏప్రిల్ 14న నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నట్లు సమాచారం.
అసలేమిటి ఈ ఎగ్జిట్ ట్రాఫికింగ్ ?
ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తిని భయం, మోసం, బలవంతం ద్వారా ఆస్ట్రేలియా వెలుపలికి పంపడం, వారి పాస్‌పోర్ట్‌లను లాక్కోవడం లేదా వీసాలను రద్దు చేయడం ద్వారా వారిపై నియంత్రణ సాధించడాన్ని ఎగ్జిట్ ట్రాఫికింగ్ గా పరిగణిస్తారు. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. వలసదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని విదేశాల్లో అనాథలుగా మార్చే ఇలాంటి చర్యలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.
దర్యాప్తు సంస్థల సూచన
వలస సంబంధిత వేధింపులకు గురవుతున్న వారు తక్షణమే పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం హ్యూమన్ ట్రాఫికింగ్ వీసా ఫ్రేమ్‌వర్క్ కింద ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. దీనివల్ల బాధితులు దర్యాప్తు జరుగుతున్న సమయంలో చట్టబద్ధంగా ఆస్ట్రేలియాలో ఉంటూ న్యాయపోరాటం చేయవచ్చు. ఈ కేసు ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయ మహిళలు తమ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉండాలనే సందేశం వెళ్తోంది.
