Gas Cylinder Placed On Railway Track: యూపీలోని కాన్పూర్‌లో (Kanpur) ఘోర రైలు ప్రమాదం తప్పింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పేలా చేసేందుకు యత్నించారు. లోకోపైలెట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్ రాజ్ నుంచి హరియాణాలోని భివానీ వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ (Kalindi Express) ఆదివారం రాత్రి శివరాజ్‌పుర్ ప్రాంతంలోని పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఢీకొట్టింది. అయితే, ట్రాక్‌పై ఏదో అనుమానాస్పద వస్తువును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపేశారు. అప్పటికే రైలు సిలిండర్‌ను ఢీకొట్టడంతో అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తు రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ విషయాన్ని లోకో పైలట్.. రైల్వే గార్డుకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, ఫోరెన్సిక్ బృందం ఘటనపై విచారణ చేపట్టింది. పట్టాలకు సమీపంలో ధ్వంసమైన సిలిండర్‌తో పాటు ఓ అగ్గిపెట్టె, పెట్రోల్ బాటిల్‌ను గుర్తించారు. ఎవరో కావాలనే రైలును పట్టాలు తప్పించుకునేందుకు ఇలా సిలిండర్ ట్రాక్‌పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రైలు దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది.
Also Read: Nadigar Sangam: కేరళ ఎఫెక్ట్ - కోలీవుడ్‌లో మహిళల రక్షణకు కమిటీ- అధ్యక్షురాలిగా నటి రోహిణి