అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాకలో మందు గుండు పేలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా వీరిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందే శరీరంపై ఉన్న చర్మం అంతా కాలిపోయి ఊడిపోయింది. చూస్తేనే భయపడేలా మారిపోయారు. వీరంతా గ్రామానికి చెందిన శంకర రావు, మహేశ్, ప్రసాద్, కమలమ్మలుగా గుర్తించారు.
ఆరిపాకకు చెందిన వీరంతా రహస్యంగా మందు గుండు తయారు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు అది పేలి ప్రమాదానికి గురయ్యారు. పేలుడు శబ్దంతో విషయం గుర్తించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే వరకు వారిని అక్కడే రోడ్డుపై పడుకోబెట్టారు. అయితే అప్పటికే వారి శరీరంపై ఉన్న చర్మం అంతా కాలిపోయి ఊడిపోయింది. నలుగురిలో మహేష్, కమలమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రహస్యంగా ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని.. ఎవరైనా ఇలాంటివి తయారు చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.