Anantapur Crime News: ధర్మవరంలో వింత కేసు - భర్త ప్రియుడి తో భార్యకు వేధింపులు.. చంపేస్తారని పోలీసులకు ఫిర్యాదు!
Husband and boyfriend: ప్రియురాలితో కలిసి భార్యపై కుట్రలు చేసే భర్తను చూసి ఉంటాం. కానీ సత్యసాయి జిల్లాలో మాత్రం భిన్నం. ప్రియుడితో కలిసి భర్త ..భార్యను చంపే ప్లాన్ చేస్తున్నారు.

Anantapur Wife Fear: పరాయి మహిళ మోజులో పడి భార్యలను చంపే వాళ్లను చూసి ఉంటాం కానీ.. పరాయి మగాడి మోజులో పడి భార్యను చంపాలనుకునేవాళ్లను చూసి ఉండం. కానీ ఇలాంటి నేరాలు కూడా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలుగులోకి వచ్చిన ఈ వింత కేసు ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం రేపుతోంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే అది మరో మహిళ అయి ఉంటుంది. కానీ ఇక్కడ భర్తకు మరో పురుషుడితో సంబంధం ఉండటం, ఆ ఇద్దరూ కలిసి భార్యను వేధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వేరే మగాడితో సన్నిహితంగా ఉంటున్న భర్త
ధర్మవరానికి చెందిన తులసికి, దాశరథి అనే వ్యక్తితో వివాహమైంది. కొంతకాలం వీరి సంసారం బాగానే సాగినా, తన భర్త ప్రవర్తనలో మార్పు రావడాన్ని తులసి గమనించారు. మన్సూరుద్దీన్ అనే వ్యక్తి తరచుగా తమ ఇంటికి రావడం, తన భర్తతో అతిగా గడపడంపై ఆమెకు అనుమానం కలిగింది. అయితే, ఒకరోజు తన బెడ్‌రూమ్‌లోనే భర్త దాశరథి , మన్సూరుద్దీన్ అత్యంత సన్నిహితంగా ఉండటం ..సహజీవనం తరహాలో వారి చేష్టలు చూసిన తులసి షాక్‌కు గురయ్యారు.
చూసి నిలదీయడంతో ఇద్దరూ కలిసి భార్యను వేధిస్తున్న వైనం
తన భర్తకు మరో పురుషుడితో అనైతిక సంబంధం ఉందని తెలుసుకున్న తులసి, వారిని నిలదీశారు. తన సంసారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన్సూరుద్దీన్‌ను దూరంగా ఉండమని కోరారు. అయితే, భర్త దాశరథి తన తప్పు దిద్దుకోకపోగా, తన ప్రియుడి కే మద్దతుగా నిలిచారు. తమ మధ్య ఉన్న బంధం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తులసిని బెదిరించడం మొదలుపెట్టారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నావంటూ భర్త , అతని ప్రియుడు మన్సూరుద్దీన్ తనను శారీరకంగా, మానసికగా వేధిస్తున్నారని తులసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని వారు వార్నింగ్ ఇస్తున్నారని, తమ ఇద్దరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె ధర్మవరం పోలీసులను ఆశ్రయించారు. తన భర్త నుంచి తనను కాపాడాలని, నిందితులిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
రక్షించాలని పోలీసుల్ని వేడుకున్న భార్య
సాధారణంగా వివాహేతర సంబంధాల కేసుల్లో మూడో వ్యక్తి నిందితులుగా ఉండటం చూస్తుంటాం, కానీ ఇక్కడ భర్త మరో పురుషుడితో సంబంధం పెట్టుకుని భార్యను వేధించడం వింతగా అనిపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టి, దాశరథి , మన్సూరుద్దీన్‌లను విచారించేందుకు సిద్ధమవుతున్నారు.























