Loan App Threats : లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అయ్యన్న, శారద దంపతుల కుమారుడు అఖిల్ (22) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక మనస్థాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ,స్నేహితులు చెప్తున్నారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన అఖిల్ స్నేహితులకు ఫోన్ చేసి తాను ఇక ఉండను అందరికీ దూరంగా వెళ్లిపోతానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని స్నేహితులు తెలిపారు. గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై గుత్తి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లోన్ యాప్ వేధింపులు
రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా లోన్ యాప్ నిర్వాహకుల తీరు మారడంలేదు. ఇచ్చిన అప్పుకు మూడింతలు వసూలు చేయడమే కాకుండా అప్పు చేసిన వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. అత్యవసరంలో అప్పు కోసం ఆన్ లైన్ లోన్ యాప్ వలలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘనలు నిత్యం ఏదొక చోట వెలుగులోకి వస్తున్నాయి. మేం చెప్పినంత డబ్బు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతాం, మీ బంధులకు పంపంచి మీ పరువు తీస్తామన్న లోనాసురుల బెదిరింపులతో ప్రాణాలు తీసుకుంటున్నారు కొందరు. లోన్ యాప్ లో అప్పు చేస్తే ఇక ఆత్మహత్య శరణ్యం అన్నట్లు చేస్తున్న కేటుగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎంతలా ప్రయత్నిస్తున్నా పరిష్కారాలు మాత్రం చూపలేకపోతున్నాయి. తక్కువ వడ్డీకే లోన్ అంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్ లను అదుపుచేసేందుకు మరింత కఠిన చట్టాలు చేయాలని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఈ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ప్రాణం గాల్లో కలిసిపోతున్నాయి.
కరీంనగర్ లో మరో ఘటన
కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ లోని సాయినగర్ చెందిన శ్రీరాముల శ్రవణ్ అనే యువకుడు లోన్ యాప్ లో దాదాపు మూడు లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అందులో కొంత డబ్బులను తన మిత్రులకు ఇచ్చాడు. వారు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ సంస్థల నిర్వాహకుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిన శ్రవణ్ కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతడిని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో శ్రవణ్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పంపించారు. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.