Anantapur Dismissed AR constable: దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరితంగా తనపై కేసులు నమోదు చేశారని డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఆరోపించారు. లక్ష్మీ అనే మహిళతో తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకొని, ఉద్దేశపూర్వకంగా తనని ఉద్యోగం నుంచి తొలగించారని.. ఎస్పీ ఫక్కీరప్ప, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, అడిషనల్ ఎస్పీ హనుమంతప్పలపై డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ చేసి  చర్యలు తీసుకోవాలని అనంతపురంలోని రెండో పట్టణ పోలీస్​స్టేషన్లో భాను ప్రకాశ్​ ఫిర్యాదు చేశారు. పోలీసులు చెబుతున్న బాధిత మహిళే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనను ఏఆర్ కానిస్టేబుల్ వేధించలేదని, ఆమె నుంచి నగదు, బంగారం తీసుకోలేదని చెప్పారని గుర్తుచేశారు.


రెండు నెలల కిందట ప్లకార్డుతో సీన్ రివర్స్.. 
సేవ్ ఏపీ పోలీస్ అని పోలీస్ ఉద్యోగుల బకాయిల గురించి రెండు నెలల కిందట సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తికి వచ్చిన సందర్భంగా ప్లకార్డ్ ప్రదర్శించాను. దీంతో తనపై కక్షగట్టి నాలుగేళ్ల కిందట నాపై నమోదైన కేసును విచారిస్తున్నట్లుగా చెబుతూ ఆ మహిళ వాంగ్మూలం ఇవ్వకపోయినా అభియోగాలు నమోదు చేస్తూ ఉద్యోగం నుంచి తొలగించాలని ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారని డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ తెలిపారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంలో ప్రమేయం ఉన్న ఎస్పీ ఫక్కీరప్ప సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు భాను ప్రకాశ్ తెలిపారు.


న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించేందుకు రెడీ.. 
వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు తనకు న్యాయం చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ వెల్లడించారు. పోలీస్​స్టేషన్​లో న్యాయం జరగని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కోర్టులో కేసు వేసి న్యాయం సాధించుకుంటానన్నారు. అవసరమైతే రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం మంత్రిని అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరతానని స్పష్టం చేశారు. గతంలో నమోదైన కేసు కోర్టులో విచారణ జరుగుతున్నా, చట్ట విరుద్ధంగా ఎస్పీ ఫక్కీరప్ప తనను ఉద్యోగం నుంచి తొలగించారని భాను ప్రకాశ్ ఆరోపించారు.  


పోలీస్‌ క్వార్టర్‌ ఖాళీ చేయాలని నోటీసులు..
డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ భాను ప్రకాశ్ పోలీస్‌ క్వార్టర్‌ ఖాళీ చేయాలంటూ మంగళవారం ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు నోటీసులు ఇచ్చారు. సర్వీసు నుంచి తొలగించిన కారణంగా, నోటీసులు అందుకున్న మూడు రోజుల్లోగా క్వార్టర్స్ ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తనపై అన్యాయంగా చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించారని, కోర్టులో విచారణ పూర్తవకుండా ఉన్న సమయంలోనే.. మరోవైపు మహిళ నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని సైతం పోలీసులు మార్చారని భాను ప్రకాశ్ ఆరోపించారు. 


 Also Read: Anantapur: అనంతపురం కానిస్టేబుల్ డిస్మిస్ కేసులో ట్విస్ట్! మీడియా ముందుకు బాధితురాలు