Amberpet AI Service Revolver Missing | హైదరాబాద్: ఇటీవల ఓ పోలీస్ నిందితుడ్ని వదిలిపెట్టేందుకు అతడి వద్ద నుంచి ఏకంగా రూ.2 కోట్లు తీసుకోవడం దుమారం రేపింది. తాజాగా మరో పోలీస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్‌ను అమ్మేయడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటన రాష్ట్ర పోలీసు విభాగంలో తీవ్ర కలకలం సృష్టించింది.  సర్వీస్ రివాల్వర్‌ను ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉంటాడన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది.

Continues below advertisement

పోలీస్ స్టేషన్‌ లాకర్‌లో భద్రపరచాల్సిన దొంగల నుంచి రికవరీ చేసిన బంగారంతో పాటు, ఎస్సైకి కేటాయించిన సర్వీస్ తుపాకీ (రివాల్వర్) కూడా కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ వస్తువులు అదృశ్యం కావడంతో, ఉన్నతాధికారులు కేసు నమోదు చేయించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి  టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై భాను‌ప్రకాష్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు పీఎస్‌లో పనిచేశాడు. ప్రస్తుతం అంబర్‌పేట్ పీఎస్ క్రైం ఎస్సైగా ఉన్నాడు. ఆ సమయంలో ఓ కేసులో రికవర్ చేసిన నాలుగు తులాల బంగారాన్ని తన డ్రాలో పెట్టాడు. కొన్ని రోజులకు అవి తీసి అమ్మేశాడు. బంగారాన్ని వాటి యజమానికి అప్పగిస్తానని చెప్పి నమ్మించి లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించాడు. కానీ వారికి ఎస్సై భాను ప్రకాష్ బంగారాన్ని తిరిగివ్వలేదు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో అతడి మీద కేసును నమోదు చేసి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

భాను ప్రకాష్ చెక్ చేసి చూడగా అందులో సర్వీస్ రివాల్వర్ లేదని గుర్తించారు. కేవలం 9ఎంఎం బుల్లెట్లు కొన్ని ఉన్నాయని, ఇటీవల రికవరీ చేసిన బంగారం కూడా లేదని స్టేషన్ పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా వారి ఆదేశాలతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్ఐ భాను ప్రకాష్ తన వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం ఈ వస్తువులను విక్రయించి ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో భావిస్తున్నారు. 

బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకున్న భానుప్రకాష్ఎస్ఐ భానుప్రకాష్ ఆర్థిక సమస్యలకు కారణంగా బెట్టింగ్ అని తెలుస్తోంది. అతడు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి తరచుగా సెలవులు తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ లో అతడు అరకోటి రూపాయల పైగా నష్టపోయాడని, దాంతో ఆర్థిక సమస్యలు అతడ్ని వెంటాడాయి. ఈ క్రమంలో భానుప్రకాష్ ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఇచ్చిన సర్వీస్ రివాల్వర్‌ను ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు విక్రయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసుల్లో రికవరీ చేసిన బంగారాన్ని సైతం వాటి యజమానికి ఇవ్వకుండా తానే విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలుతున్నాయి. ఇంతకీ సర్వీస్ రివాల్వర్ ఎవరికి విక్రయించాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసు శాఖ నిబంధనలు పాటించకపోగా, రూల్స్ ఉల్లంఘిస్తూ రివాల్వర్ అమ్మేయడంపై డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా ఉంది. త్వరలోనే అతడిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.