Webland Records Tampering: వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో రూ.కోట్ల విలువైన భూములను అనధికారికంగా ఇతరుల పేరిట మార్చేస్తున్న ఒక ముఠా గుట్టును సీఐడీ విభాగం విజయవంతంగా రట్టు చేసింది. నేషనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్‌ (NIC)కి చెందిన ఓ సీనియర్‌ అధికారి లాగిన్ క్రెడెన్షియల్స్‌ను అక్రమంగా వాడుతూ డేటాబేస్‌ను తారుమారు చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా సుమారు రూ.50 లక్షలు వసూలు చేసి 70 ఎకరాలకు పైగా భూమి రికార్డులను మార్చినట్లు తేలింది.

Continues below advertisement

వెలుగులోకి వచ్చిందిలా? 

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు, పడమరలక్ష్మీపురం గ్రామాల పరిధిలోని 6.65 ఎకరాల భూమికి సంబంధించి వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లోఅనధికారిక మార్పులు జరిగినట్లు సీసీఎల్‌ఏ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై సీసీఎల్‌ఏ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ ఈ స్కామును బయటపెట్టింది.

అక్రమాల నెట్‌వర్క్  

పడమరలక్ష్మీపురం గ్రామానికి చెందిన వడ్లమూడి ఏడుకొండలు అనే వ్యక్తి తన కుటుంబ భూములను తండ్రి వడ్లమూడి వెంకటేశ్వర్లు పేరిట మార్చేందుకు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏడుకొండలు మొదట తన బంధువు గుండపనేని వెంకటేశ్వర్లును సంప్రదించగా.. ఆయన ద్వారా పురపాలక శాఖ కమిషనరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వేముల వెంకటరావు పరిచయమయ్యాడు. వెంకట్ ద్వారా అన్న క్యాంటీన్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ షేక్ బాషా, ఆయన ద్వారా విజయవాడ ఎన్‌ఐసీలో జూనియర్ డెవలపర్‌గా పనిచేస్తూ వెబ్‌ల్యాండ్ యాక్సెస్ ఉన్న రంగయ్యగారి సాయికుమార్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారు. ఏడుకొండలు చెప్పిన భూముల వివరాలను వెంకట్, బాషాల ద్వారా సాయికుమార్‌కు చేరవేసి రికార్డుల్లో మార్పులు చేయించేవారు.

Continues below advertisement

రెవెన్యూ అక్రమాలకు బైపాస్ 

ఎన్‌ఐసీ సీనియర్ అధికారి జీవీఎస్‌ఆర్‌ శర్మకు తెలియకుండా ఆయన లాగిన్ వివరాలను వాడిన సాయికుమార్.. తహసీల్దార్ ఆఫీసు ఆమోదం, మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ వంటి ఎలాంటి రెవెన్యూ ప్రక్రియలు లేకుండానే ఆన్‌లైన్ రికార్డుల్లో కొత్త పట్టాదారుల పేర్లు ప్రత్యక్షమయ్యేలా చేశాడు. ఈ అక్రమాలకు గాను సాయికుమార్‌కు బాషా భార్య అమీనా ఖాతా నుంచి ఆగస్టులో రూ.50 వేలు, సెప్టెంబరులో రూ.25 వేలు జమ అయినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది.

కోట్ల విలువైన 70 ఎకరాలు తారుమారు  

ఈ ట్యాంపరింగ్ కేవలం ఒక కుటుంబానికే పరిమితం కాకుండా మొత్తం 30 రికార్డుల్లోని 70 ఎకరాల భూములకు పాకింది. వీటి మార్కెట్ విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారులు వడ్లమూడి ఏడుకొండలు, రంగయ్యగారి సాయికుమార్, వేముల వెంకటరావు, షేక్ బాషాలను సీఐడీ అరెస్టు చేసింది. ఈ స్కాము ద్వారా లబ్ధి పొందిన ఇతరులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.