Alluri District Crime News: అల్లూరు జిల్లా జీకీ వీధి మండలం సప్పర్ల గ్రామంలో కొర్ర కృష్ణారావు, గమ్మిలి ఈశ్వరమ్మ అలియాస్ వీరమ్మ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాల నుంచి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే భర్తపై అనుమానం పెంచుకున్న వీరమ్మ అతడిని ఆగస్టు 30వ తేదీ నాడు గొడ్డలితో దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడగా.. భార్య వీరమ్మనే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ కొర్ర కృష్ణారావు ఆగస్టు 31వ తేదీ రోజు మరణించాడు. మృతుడి తల్లి సీలేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఎస్సై జి.రామకృష్ణ ఐసీపీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు.


అసలేం జరిగిందంటే..?


కొర్ర కృష్ణారావుకు 20 సంవత్సరాల క్రితం నాగమణి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొర్ర కృష్ణారావు మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అయితే అదే గ్రామంలో భర్త చనిపోయి అప్పటికే ఒంటరిగా ఉంటున్న గేమిలి ఈశ్వరమ్మ పెద్దల సమక్షంలో కృష్ణారావును రెండో వివాహం చేసుకుంది. వీరంతా సప్పర్ల గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే మొదట భార్య బిడ్డలను రెండవ భార్య సరిగ్గా చూడటం లేదని పిల్లల నానమ్మ వాళ్లను హాస్టల్ లో చేర్పించింది. అయినప్పటికీ భార్యాభర్తలు ఇద్దరూ తరచుగా గొడవలు పడుతూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన భార్య కృష్ణారావును అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆగస్టు 30వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో భర్తను గొడ్డలితో నరికింది. తలపై మూడుసార్లు గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే భ్రతను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించింది భార్య వీరమ్మ. ఈక్రమంలోనే కృష్ణారావు చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రామాలు కోల్పోయాడు. 
ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. బార్యభర్తలు ఎక్కువగా గొడవ పడొద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే మహిళా పోలీసుల ద్వారా తమకు తెలియజేయాలని సూచించారు. అలా చేస్తే దంపతుల సమస్యలు పరిష్కరించి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తామన్నారు. దీని వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయని వివరించారు. 


నిన్నటికి నిన్న అమలాపురంలో యువకుడి హత్య  


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యువకుని హత్యతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం రాత్రి స్థానిక ఈదరపల్లి స్మశాన వాటిక వద్ద ఉన్న ఇద్దరిపై గుర్తుతెలియన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈదరపల్లి ప్రాంతానికి చెందిన పోలిశెట్టి కిషోర్‌ అనే యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలుపాలైన మరో యువకుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టానికి పంపించి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియన వ్యక్తుల దాడిలో మృతి చెందిన కిషోర్‌, గాయపడ్డ యువకుడు అమలాపురంలోని ఓ పాత రౌడీషీటర్‌ వర్గీయులు. అదే గ్రామంలోనే ఉండే ప్రత్యర్థి వర్గానికి చెందిన  అనుచరులతో వీళ్లకు గొడవ జరిగిందని ప్రచారంలో ఉంది. హత్యకు ఆ గొడవే కారణమని ప్రచారం జరగింది. దీంతో అమలాపురంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.