Global Foundation Chairman Arrested:   ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, నకిలీ నియామక పత్రాలతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ భారీ జాబ్ ఫ్రాడ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన ప్రధాన నిందితుడిని  ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిరుద్యోగుల నుంచి రూ. 5.30 లక్షలు వసూలు చేసి మోసగించిన ఈ కేసు వివరాలను ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి శుక్రవారం  అధికారికంగా వెల్లడించారు.

Continues below advertisement

కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన మహ్మద్ బాబర్,  గ్లోబల్ ఫౌండేషన్  అనే సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేని ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అతడు నిరుద్యోగులకు ఎర వేశాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నుగురు రవి, నర్సమ్మ, పృథ్వి అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నమ్మించి, వారి నుంచి నగదు ,  ఫోన్‌పే ద్వారా మొత్తం రూ. 5.30 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు అందజేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు నుగురు రవి ఇచ్చిన ఫిర్యాదుతో 2025 అక్టోబర్ 14న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

ఈ భారీ మోసంలో మహ్మద్ బాబర్ ఒంటరిగా కాకుండా పక్కా ప్లాన్‌తో మధ్యవర్తులను రంగంలోకి దించినట్లు విచారణలో తేలింది. నిర్మల్‌కు చెందిన పల్లికొండ కార్తీక్  , సూర్యాపేటకు చెందిన రాహులపెంట సతీష్ , భైంసాకు చెందిన వడేకర్ నవీన్ కుమార్  లను మధ్యవర్తులుగా వాడుకుని, అమాయక నిరుద్యోగులను గుర్తించి డబ్బులు గుంజాడు. వసూలు చేసిన డబ్బులో వీరికి కమీషన్లు ఇచ్చి, మిగిలిన భారీ మొత్తాన్ని ప్రధాన నిందితుడే నొక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

Continues below advertisement

గత కొంతకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహ్మద్ బాబర్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, జూలై 16న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి బాధితులకు ఇచ్చిన నకిలీ నియామక ఉత్తర్వుల ప్రతులను, ఒక రియల్‌మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాబర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి నిరుద్యోగులకు, ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే దళారులను, నకిలీ సంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెనుకాడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.