Adilabad Crime: బాలికపై లైంగికదాడి కేసులో సంచలన తీర్పు, 20 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు
Adilabad Court: ఆరేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష విధించింది. ధర్మాసనం తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Adilabad Court: ఆదిలాబాద్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై బాధితుల కుటుంబంతో పాటు జిల్లా ప్రజలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉట్నూర్ బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన షేక్ ఖాలిద్(45) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2 వేల జరిమానా విధించింది. జీవిత ఖైదు కన్నా ఈ జైలు శిక్ష ఎక్కువగా కావడం విశేషం.
ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై పోలీసులు స్పందించారు. ఈ చిన్నారిపై అఘాయిత్యం ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్కువ వ్యవధిలోనే అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం 60 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు వేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత పోలీసులందరూ టీమ్‌గా పని చేసి కోర్టుకు సకాలంలో అన్ని ఆధారాలను సమర్పించారు. కేవలం 135 రోజుల్లోనే కోర్టు విచారణ చేసినట్టు తెలిపారు. కోర్టు తీర్పుతోనైనా భవిష్యత్త్‌లో ఇలాంటి దారుణాలు చేసేందుకు నిందితులు భయపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచార ఘటనలు..
ఇటీవల రాష్ట్రంలో అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ పాతబస్తీలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు అరాచకానికి పాల్పడ్డారు. పాతబస్తీ ప్రాంతంలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఒక 13 ఏళ్ల బాలికపై కొందరు యువకులు రెండు రోజులపాటు లాడ్జిలో అత్యాచారం చేశారు. ఆమెను యువకులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లుగా పోలీసులు వివరించారు. మత్తు మందు ఇచ్చి ఆమె పడిపోయాక, ఓయో యాప్‌లో లాడ్జి రూం బుక్ చేసి అందులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత బాలికను ఓయో రూంలోనే వదిలి పారిపోయారు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈ విషయంపై డబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్యాచారం అనంతరం హోటల్ లోనే వదిలేసి వచ్చారు..
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యారానికి పాల్పడిన తరువాత ఆమెను లాడ్జిలోనే వదిలేశారు. మత్తు నుంచి తేరుకున్న తరువాత ఆ బాలిక అక్కడ నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను భరోసా సెంటర్‌కు పంపినట్లు వివరించారు. విచారణ జరిపి, నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితులను రిమాడంకు తరలిస్తామన్నారు.
హోటల్ నిర్వాహకులపై పోలీసుల కన్నెర్ర
నిందితులకు బాలిక ముందు నుంచే పరిచయం అని పోలీసుల విచారణలో తెలిసింది. యువకులు బాలికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులు రబీష్, నిమాయత్, మరో యువకుడు గంజాయి మత్తులో రేప్ చేశారు. రెండు రోజుల పాటు బాలికపై యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాతబస్తీలో రబీష్, నిమాయత్ గంజాయి, మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు 13ఏళ్ల బాలికను హోటల్ రూమ్ కి తీసుకెళ్లడంపై అటు హోటల్ యాజమాన్యంపై నిప్పులు కురిపిస్తున్నారు. అంత చిన్న పిల్లను ఇద్దరు యువకులు హోటల్ కి ఎలా తీసుకెళ్లనిస్తారు అని అటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లను కూడా కేసులో భాగం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.