Kakinada Real Estate Scam:  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ  అధికారులు తమ ఉచ్చును మరింత బిగించారు. కాకినాడ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, సోదాల్లో లభ్యమైన కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను చూసి అవాక్కయ్యారు. హైదరాబాద్, కాకినాడల్లో విలాసవంతమైన ఫ్లాట్లు 

Continues below advertisement

శివ కుమార్ సంపాదనతో పోలిస్తే అత్యంత విలాసవంతమైన భవనాలు, ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. కాకినాడలోని ప్రసిద్ధ ఎస్ఆర్ఎంటీ  అపార్ట్‌మెంట్‌లో రూ. 1.24 కోట్ల విలువైన త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌తో పాటు, అదే అపార్ట్‌మెంట్‌లో ఆయన భార్య పేరు మీద రూ. 1.77 కోట్ల విలువైన నాలుగు పడకగదుల  లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇది కాకుండా, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్‌లోని  వివా సిటీ'  అపార్ట్‌మెంట్స్‌లో భార్య పేరు మీద రూ. 1.34 కోట్ల విలువైన మరో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సోదాల్లో తేలింది.

 విలువైన భూములు, ఖాళీ స్థలాలు 

Continues below advertisement

స్థిరాస్తుల రూపంలో కూడా శివ కుమార్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. కాకినాడ జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో భార్య పేరు మీద రెండు విడతలుగా  రూ.18.40 లక్షల విలువైన 1.082 ఎకరాలు, రూ. 9.24 లక్షల విలువైన 0.543 ఎకరాలు  మొత్తం 1.6 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. వీటితో పాటు కాకినాడలోని ప్రముఖ ప్రాంతమైన రామారావుపేటలో శివ కుమార్ పేరు మీద రూ. 1.20 కోట్ల మార్కెట్ విలువ గల 375 చదరపు గజాల ఖాళీ స్థలం ఉన్నట్లు అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

 లగ్జరీ కార్ల గ్యారేజ్ 

ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఊహించని స్థాయిలో నిందితుడి ఇంట్లో ఖరీదైన కార్లు దర్శనమిచ్చాయి. శివ కుమార్ భార్య పేరు మీద రూ. 41.73 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్  కారు ఉంది. అలాగే, ఆయన స్వయంగా తన పేరు మీద రూ. 30 లక్షల విలువైన సరికొత్త మహీంద్రా ఎలక్ట్రిక్  కారుతో పాటు రూ. 27 లక్షల విలువైన మహీంద్రా థార్ రాక్స్  కారును కూడా కొనుగోలు చేశారు.

 బంగారం.. గ్యాడ్జెట్లు 

ఇళ్ల సోదాల్లో దాదాపు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు లభించాయి. ఇవి కాకుండా ఇళ్లలో వాడుతున్న రూ. 27.12 లక్షల విలువైన అత్యాధునిక గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీ సీజ్ చేసింది. నిందితుడి వ్యక్తిగత అవసరాల కోసం వాడుతున్న రూ. 1.50  లక్షల విలువైన శామ్‌సంగ్ ఫోల్డ్ 7  ప్రీమియం ఫోన్, రూ. 1.70 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 4 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు 

శివ కుమార్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. కాకినాడ నగరంతో పాటు రమణయ్యపేట గ్రామం, చీడిగ గ్రామం, తిలక్ వీధి ప్రాంతాల్లోని ఆయన బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏకకాలంలో 4 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విలువ కోట్లల్లో ఉండగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరికొన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ, శివ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.