ACB caught the Superintendent Engineer Kukatpally: హైదరాబాద్ నగరంలోని అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ మరోసారి రైళ్లు పరిగెత్తించింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండింగ్ ఇంజనీర్ పొద్దుటూరి చిన్నారెడ్డి , ఒక కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన భారీ బిల్లును క్లియర్ చేయడానికి దాదాపు 10 శాతం కమీషన్ డిమాండ్ చేసి, లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ. 1.40 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును ధృవీకరించి, ఆమోదం కోసం జోనల్ కమిషనర్‌కు పంపాల్సి ఉండగా, ఎస్‌ఈ చిన్నారెడ్డి లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ. 15 లక్షలు ఇస్తేనే ఫైలు ముందుకు కదులుతుందని తేల్చి చెప్పారు. ఈ మొత్తాన్ని నేరుగా కాకుండా, తన వద్ద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ బి. ప్రవీణ్ కుమార్ ద్వారా అందజేయాలని సూచించారు.
అధికారి వేధింపులు భరించలేక సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో బుధవారం ఉదయం కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ట్రాప్ ప్లాన్ చేశారు. ప్రవీణ్ కుమార్ ద్వారా ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ. 15 లక్షల నగదును స్వీకరిస్తున్న తరుణంలో ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి వారిని పట్టుకుంది. నిందితుల చేతుల నుంచి రసాయన పరీక్షల ద్వారా లంచం తీసుకున్నట్లు నిర్ధారించి, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనతో కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేవలం లంచం కేసుతోనే ఆగకుండా, చిన్నారెడ్డి చాంబర్‌లో ఉన్న కీలక ఫైళ్లను, కంప్యూటర్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తుల వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడితోనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు.
