Clash Between Two Womens Over Clothes Drying In LB Nagar: తెలంగాణలో దారుణాలు చోటు చేసుకున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొందరు దాడులకు తెగబడుతూ ప్రాణాలు సైతం తీయడానికి వెనుకాడడం లేదు. నగరంలో బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరు మహిళల మధ్య వివాదం జరిగి అది ఘర్షణకు దారి తీయగా.. సదరు మహిళల సోదరులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కత్తితో మరో వ్యక్తి గొంతు కోశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అలాగే, మద్యానికి డబ్బులు ఇవ్వాలని తరచూ వేధిస్తోన్న తండ్రిని ఓ కుమారుడు కర్రతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
బట్టలు ఆరేసే విషయంలో వివాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పరిధిలోని భరత్ నగర్‌లో బుజ్జి, కమలమ్మ అనే ఇద్దరు మహిళల కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. వీరిద్దరూ స్నేహితులైనప్పటికీ శనివారం బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఇది కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలో సదరు మహిళల సోదరులు ఎంట్రీ ఇచ్చారు. గొడవ మరింత ముదరగా విచక్షణ కోల్పోయిన బుజ్జి అనే మహిళ తమ్ముడు మరో మహిళ సోదరుడు శంకర్‌పై మటన్ కత్తితో దాడి చేశాడు. అతని గొంతు కోసం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో శంకర్‌కు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇంత జరుగుతున్నా స్థానికులు ఎవరూ వీరి గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తండ్రిని చంపేసిన తనయుడు
అటు, నిర్మల్ జిల్లాలో శనివారం మరో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తోన్న తండ్రిని కన్నకొడుకే కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత మధు(48) మద్యానికి బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని నిత్యం భార్య, కుమారున్ని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే భార్య, కుమారుడితో పాటు కోడలుని సైతం చాలాసార్లు ఇంటి నుంచి వెళ్లగొట్టిన సందర్భాలున్నాయి. ఇదే విషయంలో కుమారుడు అనిల్ తండ్రితో వారం క్రితం గొడవపడ్డాడు. 5 రోజుల క్రితం మరోసారి మద్యానికి డబ్బులివ్వాలని గొడవ చేసిన మధు డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య, కుమారుడు, కోడలిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. మళ్లీ తన ఇంటికి రావద్దంటూ బెదిరించాడు.
కర్రతో కొట్టి చంపేశాడు
తండ్రి తీరుతో విసిగిపోయిన కుమారుడు అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం మధు ఇంటికి వెళ్లగా.. మళ్లీ తన ఇంటికి ఎందుకొచ్చావంటూ కొడుకుతో తండ్రి గొడవపడ్డాడు. కోపంతో ఉన్న కుమారుడు తన వెంట తెచ్చుకున్న కర్రతో తండ్రి తలపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఇంఛార్జీ సీఐ నవీన్ కుమార్, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి గంగూభాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Hyderabad News: మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు - ఏడేళ్ల చిన్నారి మృతి, తండ్రికి గాయాలు