Kerala Crime News: కేరళలో డబుల్​ మర్డర్​ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దల మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాథలుగా మిగిలారు. అయితే ఈ డబుల్​ మర్డర్​ ఘటనపై తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందే ఆ కుటుంబంలోని మహిళను చంపిన నిందితుడు జైలుకు వెళ్లొచ్చి.. ఆ మహిళ భర్త, ఆమె అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు.

పక్కింట్లో ఉండే వ్యక్తే..కేరళలోని పలక్కడ్​ జిల్లా నెన్​మారా పట్టణంలో సోమవారం వెలుగుచూసిన జంట హత్యలు కలకలం రేపాయి. సుధాకరణ్​(55), అతడి తల్లి లక్ష్మి(75) వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. పక్కింట్లో ఉండే చెంతమార(58) అనే వ్యక్తే వారిని హత్య చసి పరారయ్యాడని స్థానికులు ఆరోపించారు. అతడిని వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో పోలీసులు అతడి కోసం జల్లెడపట్టి ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మంత్రాలు చేయడంతో తన భార్య వెళ్లిపోయిందనే పగతో..నిందితుడు చెంతమార, అతడు హత్య చేసిన మృతుల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. అయితే సుధాకరణ్​ కుటుంబం మంత్రాలు చేస్తోందని చెంతమారకు అనుమానం ఉండేది. వారి మంత్రాల కారణంగానే తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిందని నమ్మేవాడు. దీంతో సుధాకరణ్​ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. 2019లో సుధాకరణ్​ భార్య సుజితను హత్య చేశాడు. దీంతో అరెస్టైన చెంతమారా కొన్నేళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. కానీ అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు.

ఇంట్లోకి చొరబడి హత్యకొంతకాలం క్రితం జైలు నుంచి బెయిల్​పై విడుదలైన చెంతమార.. సోమవారం సుధాకరణ్​ను, అతడి తల్లి లక్ష్మిని వారి ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారించగా.. సుధాకరణ్​ తనను చంపుతాడనే అనుమానంతో వారిని హత్య చేసినట్లు పేర్కొన్నాడు.

పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదుఇంటి పెద్దలను కోల్పోయిన సుధాకరణ్​ కూతుర్లు అఖిల, అతుల్య అనాథలుగా మిగిలారు. తమ తల్లిని చంపిన చెంతమార బెయిల్​పై వచ్చి పక్కింట్లోనే ఉంటుండడంతో.. మమ్మల్ని కూడా చంపేస్తాడని, అతడిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని, ఇప్పుడు అతడు తమ తండ్రి, నాయనమ్మను పొట్టనపెట్టుకున్నాడని ఆ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని బోరున ఏడుస్తున్నారు. తమ కుటుంబాన్ని అంతం చేసిన నిందితుడు చెంతమారను ఉరితీయాలని డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే కొంత కాలానికి బెయిల్​పై వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తాడని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్​స్టేషన్ ముందు స్థానికులు ఆందోళన నిందితుడు చెంతమార అరెస్టు వార్త స్థానికులు పోలీస్​స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గుడిని తమకు అప్పగించాలని, తామే వాడిని చంపేస్తామన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్​ చేపట్టి వారిని చెదరగొట్టారు. నేడు చెంతమారను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.. జంట హత్యల రీ కన్​స్ట్రక్షన్​ కోసం అతడిని నేరస్థలానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.