Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో జనమంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఉన్న వాళ్లంతా పండగ జోష్‌లో ఉన్నారు. ఈ టైంలో పాతబస్తీలో అలజడి రేగింది. పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జ్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అక్కడి వాతావరణం అదుపులోనే ఉందని పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వల్ప వివాదమే తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. కొట్టుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. కానీ ఇరు వర్గాలు ఎవరూ వినే పరిస్థితి కనిపించలేదు. ఇంకా వివాదం పెరుగుతోందని గ్రహించిన పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.
పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్ చేశారు. వారి నుంచి కూడా ప్రతిదాడి ప్రారంభమైంది. వాళ్లు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పోలీసులకు ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగారు. అక్కడ గొడవ పడుతున్న వారిని చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపజేశారు. అర్ధరాత్రి జరిగిన గొడవ సద్దుమణిగినా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలోని రహదార్లు మూసివేశారు. కొత్త వాళ్లు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టడి చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిరంతరం అక్కడి పరిస్థితి తెలుసుకొని ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
పురానాపూల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు ప్రకటించారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదని, ప్రజలు కంగారు పడొద్దని తెలిపారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్స్, పోస్టులు పెట్టొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.