Hyderabad Crime News: హైదరాబాద్‌లోని చందానగర్‌లో నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య స్థానికంగానే కాకుండా రాష్ట్రంలోనే కలకలం రేపుతోంది. చావు అంటేనే పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలో లేని బాలుడు ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ ఆశ్చర్యానికి అంతకు మించిన గుండెలు బరువెక్కేలా చేస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కారణాలు గుర్తించే పనిలో ఉన్నారు.
చందానగర్‌లోని రాజేంద్రరెడ్డి నగర్‌లో నివాశం ఉంటున్న ప్రశాంత్ నాల్గో తరగతి చదువుతున్నాడు. పని ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కుమారుడి జాడ తెలియలేదు. వెతికారు. చివరకు బాత్రూమ్‌డోర్ గడియ పెట్టి ఉండటాన్ని చూశారు. తెరిచి చూసిన తల్లిదండ్రులకు షాకింగ్ సీన్ కనిపించింది.
ఏమైందో తెలియదు 9 ఏళ్ల ప్రశాంత్ బాత్‌రూమ్‌లో కిటికీకి వేలాడుతూ కనిపించాడు. స్కూల్ ఐడీ కార్డుకు ఉండే ట్యాగ్‌తో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు. అది చూసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. దీన్ని గమనించిన పక్కవారంతా వచ్చారు. నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని కంట తడి పెట్టుకున్నారు. ఏం కష్టం వచ్చిందో తెలియద కన్నీరుమున్నీరుగా అంతావిలపించారు.
దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తల్లిదండ్రులను, స్కూల్‌లోని వారిని విచారిస్తున్నారు.