Vizianagaram Latest News: జాతరలో పోకిరీల అసభ్య చేష్టలు- వారించిన మహిళా ఎస్సైపై దాడి- గుడివాడలో ఘటన
Vizianagaram Latest News: విజయనగరం జిల్లాలోని గుడివాడ గ్రామంలో జరిగిన ఘటన సంచలనంగా మారుతోంది. పోకిరీలను అడ్డుకున్న ఎస్సైపైనే యువకులు దాడి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Vizianagaram Latest News: విజయనగరం జిల్లా గుడివాడలో జరుగుతున్న జాతరలో ఓ లేడీ ఎస్సైపై పోకిరీలు దాడి చేశారు. ఆమెను ఇష్టం వచ్చినట్టుతిట్టమే కాకుండా దాడి కూడా చేశారు. యువతులను ఇబ్బంది పెడుతుంటే వారించినందుకు పోకిరీలు రెచ్చిపోయారు.
వేపాడ మండలంలోని గుడివాడ గ్రామంలో వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జరుగుతుంటే కొందరు పోకిరీలు వెకిలిచేష్టలు చేశారు. కార్యక్రమానికి వచ్చిన యువతులు, సందర్శకులతో అసభ్యంగా ప్రవర్తించారు.
పోకిరీల చేష్టలు గమనించిన అక్కడే ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వార్నింగ్ ఇచ్చారు. పద్దతి కాదని చెప్పారు. కానీ వారు వినిపించుకోలేదు. దీంతో వారిపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో కుర్రాళ్లు మరింతగా రెచ్చిపోయారు.
అసలు అక్కడ గొడవ జరగలేదని... ఎందుకు ఎస్సై చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. తను కొట్టడం ఏంటని నిలదీశారు. అసలు తాగి వచ్చి రభస చేయడం ఏంటని తిరిగి ప్రశ్నించారు. పద్ధతిగా లేదని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.
మందలు మందలుగా వచ్చి ఎస్సైను దుర్భాషలాడారు. ఆమెను కొట్టేందుకు పైపైకి వచ్చారు. పక్కనే ఉన్న వాళ్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. ఆమెను జుట్టుపట్టి లాగి దాడికి యత్నించారు. ప్రాణ భయంతో ఆమె సమీపంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు.
యువకుల నుంచి తప్పించుకుని ప్రాణభయంతో పరుగులు తీసిన ఎస్సై స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఫుల్ బెటాలియన్‌తో వచ్చారు. కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సైపై దాడి చేసిన 9 మందిని అరెస్టు చేశారు. ఇంకో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గాయాలు పాలైన ఎస్సై స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా ఎస్సైపై దాడి క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో మాట్లాడిన అనిత పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కేసు వివరాలను హోంమంత్రికి అనిత వివరించారు. మహిళల పట్ల పోకిరీ వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.